AP: జనసేనలోకి వైసీపీ కీలక నేతలు
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఒక్కో నేత.. ఇతర పార్టీల్లోకి వెళ్తుండటంతో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సహా మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య జనసేనలో చేరారు. మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి నాయకులను స్వాగతం పలికారు. ఈ ముగ్గురితో పాటు వైసీపీ కీలక నాయకులు జనసేన పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు అవనపు విక్రమ్, అవనపు భావన, ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జడ్పీటీసీ యాదాల రత్నభారతి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. కీలక నేతలు ఒకేసారి జనసేనలో చేరడంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
వైసీపీకి గట్టి షాక్
వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ.. కీలక నాయకులంతా వైసీపీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారు రోశయ్య, సామినేని ఉదయభాను వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు. బాలినేని మంత్రిగానూ పనిచేశారు. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డితో బాలినేనికి బంధుత్వం ఉంది. అయినప్పటికీ వైసీపీ అధ్యక్షుడి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని ఆ పార్టీని కాదని జనసేనలో చేరినట్లు తెలుస్తోంది. తాను అధికార తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో పనిచేయటం కోసమే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి వచ్చినట్లు సామినేని ఉదయభాను వెల్లడించారు. జనసేన పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రజల కోసం, అభివృద్ధి కోసం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు కోసం పనిచేస్తానని.. ఎలాంటి కండిషన్లు లేకుండా జనసేన పార్టీలో చేరినట్లు ఉదయభాను తెలిపారు. వివాదాలకు వెళ్లకుండా కూటమి పార్టీల నేతలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. 30 ఏళ్లకుపైగా తాను రాజకీయాల్లో ఉన్నానని.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని పేర్కొన్నారు.
జనసేన పార్టీ కార్యాలయం వద్ద సందడి
జనసేనలో వైసీపీ కీలక నాయకుల చేరిక నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్యతో పాటు వారి అనుచరులు భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయం నిర్మాణ పనుల కారణంగా ఒక్కో నాయకుడి వెంట లోపలకు నలుగురిని మాత్రమే అనుమతించారు. భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చిన తరుణంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com