AP Politics: వైసీపీ పెద్దలతో పార్థసారథి చర్చలు ..

ముఖ్యమంత్రిపైనే అసంతృప్తి వ్యక్తం చేసిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సోమవారం సీఎం జగన్‌ను కలిశారు. తనకు జరిగిన అవమానం, గుర్తింపు లేకపోవడం వంటి అంశాలను జగన్‌కు వివరించారు. ‘మీ ప్రాధాన్యత మీకు ఉంటుంది,సముచితస్థానం కల్పిస్తాం’అని సీఎం చెప్పినా ఆయన మెత్తబడలేదని సమాచారం. ఎస్సీ నియోజకవర్గం నందికొట్కూరు సమన్వయకర్త నియామకం కోసం ఆ నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిని జగన్ పిలిచి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిని సిద్ధార్థరెడ్డి తీసుకెళ్లారు. కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్‌ను నందికొట్కూరు బరిలో దించాలని జగన్‌కు సన్నిహిత కంపెనీ అయిన షిర్డీ సాయి అధినేత సిఫార్సు చేసినట్లు తెలిసింది. సుధీర్ స్థానికేతరుడు అనే సమస్యవస్తుందని సిద్ధార్థ చెప్పగా ‘స్థానిక, స్థానికేతర ఏముంటుంది? నందికొట్కూరుకు మనకు చాలా పాజిటివ్‌గా ఉంది’అని సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ చర్చంతా నందికొట్కూరు సిటింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ అక్కడ లేకుండానే జరిగింది.
పార్టీ, ఐ-ప్యాక్ నందికొట్కూరులో నిర్వహించిన సర్వేల్లో ఎమ్మెల్యే ఆర్థర్‌కు అనుకూలంగానే ఫలితాలు వచ్చినా ఆయన్ను మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో మాట్లాడిన సీఎం జగన్ ఈసారి మజ్జి శ్రీనివాసరావును నిలబెడతామని మీకు సరైన ప్రాధాన్యతనిస్తామని చెప్పినట్లు తెలిసింది. కనీసం అసెంబ్లీకైనా అవకాశం కల్పించాలని బెల్లాన కోరినట్లు సమాచారం. బొత్స సత్యనారాయణతో మాట్లాడి పరిశీలిద్దాం అని చెప్పినట్లు తెలిసింది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌తోనూ మాట్లాడిన జగన్ సర్వేల్లో ఆర్డీఓ కిరణ్‌కుమార్, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ పేర్లు..ముందు వరసలో ఉన్నాయని చెప్పినట్లు తెలిసింది. మురళీధర్ పార్టీ కోసం ముందునుంచీ పనిచేస్తున్నందున ఆయన అయితే బాగుండొచ్చని.. ఎమ్మెల్యే అభిప్రాయపడినట్లు సమాచారం. ఆర్డీఓపై అవినీతి ఆరోపణలు ఉన్నాయనే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. తిరుపతి ఎంపీ సీటులో పోటీ చేసే అవకాశం మళ్లీ అవకాశం కల్పించాలని వరప్రసాద్ కోరగా సీఎం జగన్ చూద్దాం అని చెప్పినట్లు తెలిసింది. నరసరావుపేటలో అసంతృప్త గ్రూపులను విజయసాయిరెడ్డి సోమవారం పిలిపించుకుని సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనిసవారెడ్డినే వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిగా కొనసాగించబోతున్నట్లు తేల్చి చెప్పారు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి ఇద్దరూ ముఖ్యమంత్రిని కలిశారు. సర్వే రిపోర్టులు ఎమ్మెల్యేకి సానుకూలంగా లేవని వెంకటరెడ్డికి కొంత అనుకూలంగా ఉన్నాయని సీఎం చెప్పినట్లు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com