ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడినదంటూ మరొక ఆడియోను విడుదల చేసిన సందీప్

ఇప్పటికే పలు వివాదాల్లో ఉన్న తాటికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి... ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. MLA శ్రీదేవి మాట్లాడినదంటూ మరొక ఆడియోను విడుదల చేశారు వైసీపీ బహిష్కృత నేత సందీప్. ఈ ఆడియోలో రెడ్డి సామాజిక వర్గంపై శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పర్ క్యాస్ట్ వాళ్లు... ఎస్సీ, ఎస్టీలను వాడుకుంటున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి ఫోన్‌లో సంభాషించినట్లు సందీప్ ఆడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడీ ఆడియో వైరల్‌గా మారింది. ఎస్సీలు, బీసీలు కలిసి ఉండాలని... రెడ్లు అనేవాళ్లు డేంజర్ అని శ్రీదేవి వ్యాఖ్యానించారు. ఈ ఆడియోలో స్థానిక నేతలతో తనకున్న విభేదాలను శ్రీదేవి బయటపెట్టినట్లు ఉంది.
ఇటీవల తనపై వైసీపీ కార్యకర్త సందీప్ చేసిన ఆరోపణలను తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఖండించారు. సందీప్ విడుదల చేసిన ఆడియోలో వాయిస్ తనది కాదని వాదించారు. తన వాయిస్‌ను ఇమిటేట్ చేసి తన ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సందీప్, సురేష్ లు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. అయితే ఇప్పుడు సందీప్ మరో ఆడియోను రిలీజ్ చేయడం అధికార వైసీపీలో కలకలం రేపుతోంది.