YSRCP: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ అరాచకాలు

ఇష్టారీతిలో దాడులు, కోడ్​ ఉల్లంఘనలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటమి భయంతో వైకాపా అరాచకాలకు పాల్పడుతోంది. ఆ పార్టీ నేతలు కోడ్‌ ఉల్లంఘిస్తూ ఇష్టారీతిన సిద్ధం స్టిక్కర్లు అంటిస్తున్నారు. మరోవైపు ఓటర్లను భయపెట్టి తమవైపు తిప్పుకునేందుకు కూటమి నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 8 కోట్ల నగదు పోలీసులకు చిక్కడం కలకలం సృష్టించింది.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా నేతలు యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘించారు. ప్రచారం పేరుతో ఇంటింటికీ వెళ్లి ప్రహరీ గోడలు, తలుపులపై వైకాపా సిద్ధం స్టిక్కర్లు అంటించారు. ప్రచారం మాటున ఓటర్ల ఫోన్‌పే, గూగుల్‌ పే నెంబర్లు సేకరిస్తున్నట్లు సమాచారం. N.T.R. జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద అక్రమంగా తరలిస్తున్న 8 కోట్ల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. చెక్‌పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా మెదక్‌ జిల్లా నుంచి గుంటూరు వైపునకు పైపుల లోడుతో వెళ్తున్న లారీ క్యాబిన్‌లో నగదును గుర్తించారు. డబ్బు స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నగదు ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్తోంది..? ఎవరికి వెళ్తోందనే అంశాలపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెంలో పోలీసులు 23 లక్షల రూపాయలు పట్టుకున్నారు. పామంజి నరసింహారావు అనే వ్యక్తి హడావుడిగా బైక్‌పై వెళ్లడం గమనించిన పోలీసులు ఆపి తనిఖీలు చేయగా నగదు పట్టుబడింది. 23 లక్షలు పొలం అమ్మిన తాలూకా డబ్బులని నరసింహారావు చెప్పారు. కానీ పత్రాలేవీ చూపించనందున డబ్బు సీజ్‌ చేశామని పోలీసులు చెప్పారు. పట్టుబడ్డ నరసింహారావు చీరాల అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ అనుచరుడని సమాచారం. పల్నాడు జిల్లా గురజాల మండలం చర్లగుడిపాడులో తెదేపా నాయకుడు పొట్ల లక్ష్మీనారాయణపై గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి గ్రామంలో పర్యటించిన తర్వాత కొంతమంది వ్యక్తులు వచ్చి దాడి చేసినట్లు తెలుగుదేశం శ్రేణులు తెలిపాయి.

సీఎం సొంత ఇలాకా Y.S.R. జిల్లా బద్వేలు, పోరుమామిళ్ల మండలాల్లో వైకాపా నేతలు యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘించారు. పోరుమామిళ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ సిద్ధం స్టిక్కర్లు అతికించారు. బద్వేల్‌లోని సిద్దవటం రోడ్‌, విద్యానగర్‌ వీధుల్లో ఇళ్ల ప్రహరీ గోడలకు, విద్యుత్‌ స్తంభాలకు ఇష్టారీతిన స్టిక్కర్లు అంటించారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి

Tags

Next Story