Yuvagalam: ఏపీని జగన్ రైతులేని రాష్ట్రంగా మార్చాడు: లోకేష్

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాల్ని అభివృద్ధి చేశారన్నారు తెలుగుదేశం యువనేత నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా సత్యవేడు నియోజకవర్గం రాజులకండ్రిగలో హర్టికల్చర్ రైతులతో లోకేష్ సమావేశమయ్యారు. చంద్రబాబు హయాంలో రైతు రుణాలను రద్దు చేశారని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు వేశామన్నారు . అకాల వర్షాల, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతే చంద్రబాబు ఆదుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఆక్వా రైతులకు మేలు చేసేలా చంద్రబాబు విద్యుత్ బిల్లులు తగ్గించారన్నారు. సస్యశ్యామలంగా ఉన్న రాష్ట్రంలో ఒక్క ఛాన్స్‌తో గద్దెనెక్కిన జగన్ రైతు రాజ్యం తెస్తానని రైతు లేని రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు లోకేష్. రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడోస్థానంలో ఉందన్నారు. మోటార్లకు మీటర్ల పేరుతో రైతుల మెడకు జగన్ ఉరితాడు బిగిస్తున్నాడన్నారు.
లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేష్ వెంట వేలాది మంది యువత తరలివస్తున్నారు. పాదయాత్రలో భాగంగా రహదారి వెంట ఉన్న పంటపొలాల్లోకి లోకేష్ వెళ్లారు. ఇక తిమ్మనాయుడు గుంటలో ముత్తరాసి సామాజిక వర్గీయులతో భేటీ అవుతారు లోకేశ్. తిమ్మసముద్రంలో ఎస్టీ వర్గీయులతో సమావేశమై వారి సమస్యలు ఆరా తీయనున్నారు. తర్వాత సదాశివపురంలోస్థానికులతో సమావేశమవుతారు. ఇక రాత్రికి బైరాజు కండ్రిగలో లోకేష్ బస చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com