Yuvagalam : రాప్తాడులో రాబందులు అధికారంలోకి వచ్చాయి : లోకేష్

2019లో రాష్ట్రంలోనూ, రాప్తాడులో వైసీపీ రాబందులు అధికారంలోకి వచ్చాయని విమర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన్ను.. రాప్తాడు పరిధిలోని ఎన్ఎస్ గేటు జాకీ భూ నిర్వాసితులు, మహిళలు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. ధనాశతో క్యాష్ రెడ్డిగా పేరుగాంచారని, 15 కోట్లు కప్పం కట్టకపోతే జాకీ పరిశ్రమని ఏర్పాటు చేయనివ్వనని బెదిరించడంతో ఆ కంపెనీ తరలిపోయిందని భూ నిర్వాసితులు, స్థానికులు లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర`క్యాష్` రెడ్డి డబ్బు పిచ్చి తమ ప్రాంతీయులు 6వేల మందికి ఉపాధి దూరం చేసిందని వాపోయారు.
ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జాకీ పరిశ్రమ ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. తోపుదుర్తి కుటుంబ సభ్యుల అవినీతి కారణంగానే రాప్తాడుకు జాకీ పరిశ్రమ రాలేదని అన్నారు. జాకీ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి 15కోట్లు కప్పం కట్టాలని బెదిరించారని.. ఈ వేధింపులు భరించలేక జాకీ తెలంగాణకు తరలి వెళ్లిపోయిందని వారు లోకేష్‌కు వివరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు కొత్తవి రాక, ఉన్నవి తరలిపోయి ఉపాధి కోల్పోయామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలు రాప్తాడుకి తీసుకురావాలని లోకేష్‌ను కోరారు.
మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 2017లో జాకీ కంపెనీని రాప్తాడుకు తీసుకొచ్చామని లోకేష్ తెలిపారు. కంపెనీ కోసం 27ఎకరాల భూమిని కేటాయించి, మౌలిక సదుపాయాలు కల్పించామని.. జాకీ సంస్థ పనులు కూడా ప్రారంభించిందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కమిషన్ల కోసం జాకీ యాజమాన్యాన్ని వేధించడంతో రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయిందన్నారు. డబ్బు పిచ్చితో జాకీ సంస్థని బెదిరించి తరిమేసి రాప్తాడుకు తోపుదుర్తి ప్రక్యాష్ రెడ్డి తీరని ద్రోహం చేశాడన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలు తీసుకొచ్చి అందరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com