Yuvagalam : టీడీపీ మాత్రమే అనంతపురాన్ని అభివృద్ది చేసింది : లోకేష్

అనంతపురం జిల్లాలో వర్షపాతం దేశంలోనే అతి తక్కువని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం పాదయాత్రలో నేడు అనంతపురంలో పర్యటిస్తున్న ఆయన... కరువు నేలలో తాగునీటికీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసింది గత టీడీపీ ప్రభుత్వమేనన్నారు. పంట కుంటలు తవ్వించి.. చెక్ డ్యామ్‌లు నిర్మించి దేశంలోనే అనంతపురాన్ని మొదటి స్థానంలో నిలిపామని పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెరిగాయన్న ఆయన.. డ్రిప్ పరికరాలు సబ్సిడీపై అందించామని.. నీటిని పొదుపుగా వాడుకుని రైతులు బంగారు పంటలు పండించారన్నారు.
అనంతపురం జిల్లాలో యువగళం పాదయాత్ర సందర్భంగా కూడేరు వద్ద మండువేసవిలో కనిపించిన పచ్చిన పంటల వద్ద లోకేష్ సెల్ఫీ దిగారు. ఈ పచ్చని పంటలు టీడీపీ ప్రభుత్వం.. రైతులకు చేసిన మేలుకు పచ్చని సాక్ష్యమని పేర్కొన్నారు. ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలో 890 కోట్లతో మంజూరు చేసిన మెగా డ్రిప్ పథకంతో 50వేల ఎకరాలు సాగవుతున్నాయని.. ఇదీ తెలుగుదేశం ముందుచూపని అన్నారు. ఇదీ వ్యవసాయాన్ని పండగ చేసిన చంద్రబాబు పాలన అని చెప్పారు. ప్రస్తుతం వ్యవసాయానికి సాయం అయ్యే ఒక్క మంచి పనీ చేయని జగన్.. రైతుల మోటార్లకు మీటర్లు మాత్రం ఉరితాళ్లలా బిగిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రాజ్యం తెస్తానని.. రైతుల్లేని రాజ్యం చేస్తున్నారని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com