Yuvagalam : 'గంజాయి వద్దు బ్రో' అంటున్న నారా లోకేష్

Yuvagalam : గంజాయి వద్దు బ్రో అంటున్న నారా లోకేష్
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి అంటూ సందేశం ఇస్తున్నారు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో.. 'గంజాయి' వద్దు బ్రో అంటూ నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ క్యాంపెయిన్ చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రకి సంఘీభావం తెలిపి.. బాలయ్య పాదయాత్రలో పాల్గొన్నారు. గంజా వద్దు బ్రో అని రాసి ఉన్న క్యాప్ ధరించి... యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి అంటూ సందేశం ఇస్తున్నారు. ఇదే సందేశంతో టీ షర్టులు, క్యాపులను టిడిపి నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత, TNSF నాయకులు, వాలంటీర్లు ధరించారు. గంజాయికి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అంటూ గత 63 రోజులుగా డ్రగ్స్ సంస్కృతికి వ్యతిరేకంగా లోకేష్‌ పోరాటం చేస్తున్నారు. జగన్ పాలనలో ఏపీ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి తిరుమలను కూడా వైసీపీ వదలడం లేదు అంటూ లోకేష్ మండిపడ్డారు. తిరుమల లో గంజాయి అమ్ముతున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దీనివల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందని... తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ హయాంలో 40వేల కోట్ల రూపాయిలు విలువ చేసే గంజాయిని తగలబెడితే... ఇప్పుడు ఏకంగా వైసిపి నాయకులు దాని పంట వేస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. పాదయాత్రలో ఉండగా చంద్రగిరిలో ఒక తల్లి వచ్చి.. తన కుమార్తె మాదక ద్రవ్యాలకు బానిస అయ్యింది అని చెప్పిందని.. ఆ సంఘటన తనను కలచివేసిందన్నారు లోకేష్‌. అందుకే గంజాయికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టిడిపి హయాంలో పెట్టిన డి ఎడిక్షన్ సెంటర్లను కూడా వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. యువత అంతా డ్రగ్స్ కు దూరంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసిపి ఈ మాఫియాపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story