Yuvagalam: కొండారెడ్డి బురుజు వద్ద జనసునామీ

Yuvagalam: కొండారెడ్డి బురుజు వద్ద జనసునామీ
టీడీపీ అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసి తీరుతామని యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చారు

టీడీపీ అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసి తీరుతామని యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. జగన్‌లా మాటమార్చి మడమ తిప్పే బ్యాచ్‌ తమది కాదన్నారు. నిరసన తెలపడానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. కర్నూలుకు హైకోర్టు తెస్తామని మోసం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన చేయాలని సూచించారు. హైకోర్టు అంశంపై కొందరు న్యాయవాదులు ఆందోళన చేయడం.. టీడీపీకి మద్దతుగా మరికొందరు లాయర్లు నినాదాలు చేయడం.. నిరసన తెలపడానికి స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ రావడంతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టీడీపీ మద్దతుదారుల నినాదాలతో కర్నూలు పాత బస్తీ మార్మోగింది. పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పి పంపించడంతో పాదయాత్ర ముందుకు కదిలింది.

ఇక కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద లోకేష్‌ పాదయాత్ర జనసునామీని తలపించింది. ఇసుక వేస్తే రాలనంత మంది జనం తరలివచ్చారు. లోకేష్‌కు మద్దతు తెలిపేందుకు భారీగా తరలివచ్చిన జనంతో కొండారెడ్డి బురుజు సెంటర్‌ కిక్కిరిసిపోయింది. బురుజు సెంటర్‌లో లోకేష్‌ను కలిసిన స్థానిక ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. అందరి సమస్యలు ఓపికగా విన్న లోకేష్... అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చడం, చంద్రబాబు చేసిన శంకుస్థాపనలకు మళ్లీ శిలాఫలకాలు వేసి డబ్బా కొట్టుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నారని లోకేష్ విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి పని లేదన్నారు. కర్నూలు ఓల్డ్ సిటీ- జోహారాపురం మధ్య హంద్రీనీవా నదిపై టీడీపీ నిర్మించిన వారధిని జగన్‌ ఖాతాలో వేసుకోవడం సిగ్గు చేటన్నారు. బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని లోకేష్ మండిపడ్డారు. గత ప్రభుత్వం బీసీల కోసం ప్రవేశపెట్టిన వంద పథకాలను జగన్‌ రద్దు చేశారని... బీసీలను అణచివేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. వైసీపీ పాలనలో బీసీలపై 26వేల తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇక బీసీలకు చట్ట సభల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ టీడీపీనేనని.. అధికారంలోకి వచ్చాక బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story