Alia Bhatt: ఇంతగా దిగజారిపోవాలా! ఆలియా సూటి ప్రశ్న....

ఎంత సెలబ్రిటీ అయినా వారికంటూ ఓ పర్శనల్ స్పేస్ ఉంటుంది. దాన్ని అతిక్రమిస్తే ఎలాంటి వారికైనా వళ్లు మండుతుంది అనడంతో సందేహమేలేదు. అయితే, కొంత మంది ఔత్సాహిక మీడియా జనాలు అత్యుత్సాహంతోనో, లేక టీఆర్పీ రేటింగుల కోసమో... ఆ స్వల్ప గీతను దాటేందుకు వెనుకాడటం లేదు. దీంతో అటు సెలబ్రిటీలకు, ఇటు అత్యుత్సాహం కనబరచిన వారికి సైతం సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఫైర్ అయింది. తన ఇంట్లో సేదతీరుతున్న సమయంలో ఫొటోలు తీయడంపై ఆమె మండిపడుతోంది. మధ్యాహ్నం లివింగ్ రూమ్ లో సేదతీరుతున్న సమయంలో ఎవరో తనని గమనిస్తున్నట్లు భావించిన ఆలియా తల పైకెత్తి చూడగా పక్క భవంతి పై నుంచి ఇద్దరు ఫొటోగ్రాఫర్లు తనని షూట్ చేయడం గమనించానని, ఆ కాసేపటికే ఓ వెబ్ సైట్ లో తన పర్సనల్ ఫొటోలు దర్శనమిచ్చాయని వెల్లడించింది. ఈ చర్య తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించేదే అంటూ మండిపడింది. రేటింగ్ ల కోసం, కంటెంట్ కోసం ఇంత దిగజారిపోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. మరోవైపు తన పోస్ట్ కు ముంబై పోలీసులను సైతం ట్యాగ్ చేయగా, వారు కూడా స్పందించారు. దీనిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆలియా కోరారు. అనంతరం తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆలియా పోస్ట్ కు మద్దతుగా పలువురు సెలబ్రిటీలు ఆమెకు సంఘీభావం తెలియజేశారు. మరి కొందరు తమ చేదు అనుభవాలను సైతం పంచుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com