Bollywood: సుశాంత్ సింగ్ యాదిలో..!
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లో తనదైన మార్క్ వేసుకున్న యువ నటులు ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. తన నటనతో అందరి మనసుల్ని అనతి కాలంలోనే దోచుకున్న సుశాంత్ తెర వెనకాల కూడా ఎందరి హృదయాల్లోనో చిరస్మరణీయమైన స్థానం పొందాడు.
అయితే అనుమానాస్పదస్థితిలో అతను మరణించడం అభిమానులను ఎంతగా కలచివేసిందో తెలిసిందే... అతడి మరణానికి గల కారణమేంటో ఇప్పటీకీ తెలియరాలేదు. కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. అయితే నేడు సుశాంత్ మూడవ జయంతి పురస్కరించుకుని అతడి స్మృతిలో అభిమానులు, తోటి నటులు సోషల్ మీడియాలో తమ మనోభావాలను పంచుకుంటున్నారు.
1986 జనవరి 21న కృష్ణకుమార్‌సింగ్, ఉషా సింగ్ దంపతులకు పాట్నాలో జన్మించిన సుశాంత్.. నటన పట్ల తనకున్న ఆసక్తితో ఇంజినీరింగ్ పూర్తవగానే డాన్స్ స్కూల్‌లో చేరాడు. తరువాత 2008లో 'కిస్ దేశ్ మే హై మేరా దిల్' అనే సీరియల్ ద్వారా బుల్లి తెరపై అడుగు పెట్టాడు. ఈ సీరియల్ తరువాత వెనక్కి తిరిగి చూడని సుశాంత్ ఓక్కో మెట్టు ఎక్కుకుంటూ బాలీవుడ్ స్థాయికి ఎదిగాడు.
'కాయ్ పో చే' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన సుశాంత్ ఆ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత వరుసుగా ఆఫర్లు అందుకొని పీకే దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ కంట పడి ఆ సినిమాలో కీలక పాత్ర దక్కించుకున్నాడు. సర్ఫరాజ్ యూసుఫ్‌గా ఎందరో అమ్మాయిల హృదయాలను దోచుకున్నాడు. ఎంఎస్ ధోనీ అన్‌టోల్డ్ స్టోరీ తో సుశాంత్ స్టార్‌డమ్ మరింత పెరిగింది. కేదార్‌నాథ్, రబ్తా, చిచ్చోరే సినిమాలతో దూసుకు పోయాడు.
2020 జూన్ 21న అనుమానస్పద రీతిలో తన ప్రాణాలు విడిచి అనంతలోకాలకు వెళ్లాడు సుశాంత్. చివరగా 'దిల్ బేచారా' సినిమాలో కనిపించిన సుశాంత్... ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ ఎప్పటికీ ఓ మధురానుభూతిగా మిగిలిపోతాడు అనడంలో సందేహమేలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com