డ్రగ్స్ కేసు.. ఒకే సమాధానం చెబుతున్న నలుగురు హీరోయిన్లు!

డ్రగ్స్ కేసు.. ఒకే సమాధానం చెబుతున్న నలుగురు హీరోయిన్లు!
సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై విచారణ జరుపుతున్న ఎన్‌సీబీ.. ఇప్పటికే కీలక విషయాలు సేకరించింది.

బాలీవుడ్‌ డ్రగ్స్‌ లింకులు వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్న ఎన్‌సీబీ.. ఇప్పటికే ప్రశ్నించిన హీరోయిన్లను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై విచారణ జరుపుతున్న ఎన్‌సీబీ... ఇప్పటికే కీలక విషయాలు సేకరించింది. విచారణకు హాజరైన నలుగురు హీరోయిన్లు.. దాదాపు ఒకేలా సమాధానాలు చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిని మళ్లీ ప్రశ్నిస్తారని తెలుస్తోంది. అటు.. రియా, షోవిక్‌ బెయిల్‌ పిటిషన్‌లపై ముంబై హైకోర్టులో విచారణ ముగిసింది.

డ్రగ్స్‌ కేసులో ఎన్‌సీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో రూపొందించిన సమగ్ర నివేదికపై చర్చించేందుకు ఎన్‌సీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఆస్తానా నేతృత్వంలో అధికారులు సమావేశం అయ్యారు. ముంబైలో విస్తరించిన డ్రగ్‌ మాఫియా మూలాలు బయటకు తీసి.. చార్జిషీటు వేసేందుకు దాదాపు ఆరు నెలల సమయం పడుతుందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు ఆస్తానా పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ముఖ్యంగా 20 మంది బడా డ్రగ్‌ సరఫరాదారులపై ఎన్‌సీబీ ఫోకస్‌ చేసినట్టు తెలుస్తోంది. అటు.. దీపికా, శ్రద్ధాకపూర్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, సారా అలీఖాన్‌ చెప్పిన సమాధానాలపై NCB అధికారులు సంతృప్తిగా లేరని సమాచారం. వీరంతా చాలా ప్రశ్నలకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అందరినీ మరోసారి పిలిచి విచారించే అవకాశాలు ఉన్నాయి.

అటు.. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ పూర్తయింది. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. రియా, షోవిక్ బెయిల్ పిటిషన్లపై ఎన్‌సీబీ అభ్యంతరం తెలిపింది. రియా, షోవిక్ డ్రగ్స్ సిండికేట్‌లో సభ్యులని.. ప్రముఖలందరికీ డ్రగ్స్ సరఫరా చేసిన వారితో వీరిద్దరికీ సంబంధాలున్నాయని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఎన్‌సీబీ ప్రధానంగా పేర్కొంది. సుశాంత్‌కు రియా డ్రగ్స్ అందించిందని ఎన్‌సీబీ కోర్టుకు తెలిపింది.

సెప్టెంబర్ 4న రియా సోదరుడు షోవిక్‌ను, సెప్టెంబర్ 8న రియా చక్రవర్తిని ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీ గడువు అక్టోబర్ 6తో ముగియనుంది. రియా చక్రవర్తి ప్రస్తుతం బైకులా జైలులో ఉండగా, ఆమె సోదరుడు షోవిక్ తలోజాను సెంట్రల్ జైలులో ఉన్నారు.

Read MoreRead Less
Next Story