Boney Kapoor: సైబర్ నేరగాళ్ల వలలో స్టార్ ప్రొడ్యూసర్.. క్రెడిట్ కార్డుతో డబ్బు చోరీ..

Boney Kapoor: రోజురోజుకీ సైబర్ క్రైమ్ సంఖ్య ఎక్కువయిపోతుంది. పోలీసుల ఎత్తులకు సైబర్ నేరగాళ్లు పైఎత్తులు వేస్తూ నేరాలకు పాల్పడి తప్పించుకొని తిరుగుతున్నారు. రిచ్, మిడిల్ క్లాస్ అని తేడా లేకుండా ఇప్పటివరకు ఎన్నో లక్షలమంది బ్యాంక్ అకౌంట్ల నుండి చోరికి పాల్పడ్డారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్‌కు కూడా ఆ చేదు అనుభవం ఎదురయ్యింది.
బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించారు బోనీ కపూర్. అయితే తన క్రెడిట్ కార్డును ఎవరో దుర్వినియోగం చేశారని బోనీ కపూర్ ఇటీవల గుర్తించారు. ఫిబ్రవరి 9న మొత్తం అయిదు సార్లు ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించారు. దీని ద్వారా మొత్తం రూ. 3.82 లక్షల నగదు బోనీ కపూర్ బ్యాంక్ అకౌంట్ నుండి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అయితే క్రెడిట్ కార్డు బిల్లు వచ్చేవరకు బోనీ కపూర్‌కు ఈ లావాదేవీల గురించి తెలియదు.
దీంతో వెంటనే బోనీ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన క్రెడిట్ కార్డు వివరాలను ఎవరూ అడగలేదని, దీనికి సంబంధించి ఎలాంటి ఫోన్ రాలేదని బోనీ కపూర్ పోలీసులకు తెలిపాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు ఈ డబ్బంతా గురుగ్రామ్‌లోని ఓ కంపెనీ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అయినట్టు గుర్తించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపినట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com