Cinema: నెపో కింగ్ తో ప్రియాంక అచ్చికబుచికలు

బాలీవుడ్ లో చెత్త రాజకీయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడంతోనే ఆ పరిశ్రమను వీడాల్సి వచ్చిందని దేశీ గర్ల్ ప్రియాంకా చోప్రా వెల్లడించడం ప్రస్తుతం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెపోటిజంపై మరోసారి పెద్ద ఎత్తు చర్చ జరుగుతోంది. కంగనా రనౌత్ సైతం కరణ్ జోహార్ గ్యాంగ్ వల్లే ప్రియాంకా చోప్రా బాలీవుడ్ ను విడిచి వెళ్లిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ముంబైలోని నీతాముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లో నిర్వహించిన ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్ లాంచ్ కార్యక్రమానికి ప్రియాంకా చోప్రా, తన భర్త నిక్ జోనాస్ సహా హాజరైంది. పెద్ద ఎత్తున సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇందులో భాగంగానే కరణ్ జోహార్ కూడా ఈవెంట్ కు హాజరయ్యాడు. అయితే ఈ కార్యక్రమంలో ప్రియాంకా, కరణ్ ఒకరికొకరు ఎదురుపడటంతో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, అందరి అంచనాలకూ భిన్నంగా ప్రియాంక, కరణ్ ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అసలు బయట జరుగుతున్న చర్చతో సంబంధం లేనట్లు కబుర్లు కలబోసుకున్నారు. దాంతో ఒక్కసారిగా నెపోటిజంపై చలరేగిన చర్చ చప్పున చల్లారిపోయిందనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com