Karan Johar: కరణ్ జోహార్‌పై కోర్టులో కేసు.. చిక్కుల్లో పడ్డ సినిమా..

Karan Johar: ఓ సినిమా విడుదలవ్వగానే అది తమ కథ అంటూ ఆరోపించి కోర్టును ఆశ్రయించే రచయితలు ఎంతోమంది ఉంటారు. ఇప్పటికీ సినీ పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా బాలీవుడ్‌లో అలాంటి ఓ ఘటనే చోటుచేసుకుంది. పైగా దీని వల్ల ఓ యంగ్ హీరో సినిమా చిక్కుల్లో పడింది. ఇదంతా ఓ రచయిత.. కరణ్ జోహార్‌పై పెట్టిన కేసుతోనే మొదలయ్యింది.
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రమే 'జుగ్ జుగ్ జీయో'. అనిల్ కపూర్, నీతూ కపూర్‌లాంటి సీనియర్ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. జూన్ 24న విడుదల కావాల్సిన జుగ్ జుగ్ జీయోకు ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చిపడింది.
రాంచీకి చెందిన రచయిత విశాల్ సింగ్.. జుగ్ జుగ్ జీయో కథ తనది అంటూ కోర్టులో కేసు పెట్టాడు. 'బన్నీ రాణి' అనే టైటిల్‌తో తాను ఓ కథ రాసుకున్నానని, ఆ కథకు నిర్మాతగా వ్యవహరించడం కోసం కరణ్ జోహార్‌ను తాను సంప్రదించినట్టు తెలిపాడు విశాల్ సింగ్. అయితే ధర్మ ప్రొడక్షన్స్ నుండి తనకు రిప్లై కూడా వచ్చిందని.. అంతలోనే తన కథతో జుగ్ జుగ్ జీయో సినిమాను తెరకెక్కించారని ఆరోపించాడు విశాల్ సింగ్.
జనవరి 2020లోనే తాను బన్నీ రాణీ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నానన్నాడు విశాల్ సింగ్. అయితే 2020 ఫిబ్రవరిలో ఆ కథను ధర్మ ప్రొడక్షన్స్‌కు పంపించానని తెలిపాడు. దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్ కూడా తన దగ్గర ఉన్నాయని, ఇది కాదు కరణ్ జోహార్ అంటూ కరణ్‌కు వార్నింగ్ ఇచ్చాడు విశాల్ సింగ్. విశాల్ పిటీషన్‌ను పరిశీలించిన రాంచీ కమర్షియల్ కోర్టు.. సినిమా విడుదలకు ముందే తమకు ఓసారి చిత్రాన్ని చూపించాలని.. ఆ తర్వాత కాపీరైట్ జరిగిందా లేదా అని నిర్ధారించి తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com