Kiran Gosavi : పోలీసుల అదుపులో డ్రగ్స్ కేసు సాక్షి కిరణ్ గోసావి..!

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో NCB సాక్షిగా ఉన్న కిరణ్ గోసావిని అరెస్ట్ చేశారు పోలీసులు. పూణెలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2018కి సంబంధించిన ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ చేసినట్టు చెప్తున్నా.. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్న నేపథ్యంలో ఈ విచారణ ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.
షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ను విడుదల చేసేందుకు 25 కోట్లు NCB అధికారి డిమాండ్ చేశారని, ఆ డీల్ చర్చలు గోసావి ద్వారా జరిగాయని ప్రభాకర్ సెయిల్ ఆరోపించారు. గోసావి బాడీగార్డ్‌గా ఉన్న ప్రభాకరే ఈ తరహా ఆరోపణలు చేయడంతో ఇది సంచలనంగా మారింది. ఆ తర్వాత నుంచి గోసావి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అతని కోసం అక్టోబర్ 14న పోలీసులు లుకవుట్ నోటీస్ కూడా జారీ చేశారు. ఇప్పుడు అరెస్టు నేపథ్యంలో డ్రగ్స్ కేసు దర్యాప్తులో నెక్స్ట్ అతన్ని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆర్యన్ ఖాన్‌ను NCB అరెస్ట్ చేసినప్పుడు గోసావి అతనితో సెల్ఫీ తీసుకుని ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. ఆ టైమ్‌లో అతను అక్కడ ఎందుకున్నాడనేది కూడా చర్చనీయాంశమైంది. ప్రభాకర్ ఆరోపిస్తున్నట్టు నిజంగానే డ్రగ్స్ కేసులో తెరవనుక డీల్స్ జరిగాయా అనే దానిపై ప్రస్తుతం విచారణ కూడా జరుగుతోంది. ఇదిలాఉంటే.. 25 కోట్లు డిమాండ్ చేశారంటూ వచ్చిన ఆరోపణల్ని గోసావి ఖండించారు. తన కాల్‌డేటా, వాట్సప్ హిస్టరీ బయటపెడితే వాస్తవాలు అందరికీ తెలుస్తాయన్నారు. ప్రభాకర్ కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మహారాష్ట్ర మంత్రి తరచుగా చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో గోసావి చెప్పిన అంశాలు దర్యాప్తు అధికారి వాంఖడేకు ఊరటనిచ్చేవే. అలాగే ఆర్యన్ ను అరెస్ట్ చేయకుండా 25 కోట్లు డిమాండ్ చేశారన్న ప్రభాకర్ సెయిల్ ఆరోపణలు వెలుగుచూసి మూడు రోజులైనా ఇటు షారూక్ ఖాన్ కానీ, ఆయన భార్య గౌరీ స్పందించకపోవడం, నోరు మెదపకపోవడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com