'బ్రూస్‌లీ' ప్రాణాలు తీసిన పెయిన్ కిల్లర్

ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల మరణం అత్యంత విషాదంగా ముగుస్తుంది.. అతి చిన్న వయసులో అసువులు బాసి అభిమానులకు కన్నీటి జ్ఞాపకాలను మిగులుస్తారు.. మార్షల్ ఆర్ట్స్అంటే మొదటగా గుర్తొచ్చే పేరు బ్రూస్‌లీ.. ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల గురించి, ఎవరికీ తెలియని వారి ముగింపు విషాదాన్ని అభిమానులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. చైనీయుల జాతకం ప్రకారం డ్రాగన్ గడియల్లో పుట్టినవాళ్లు మహర్జాతకులు అవుతారు. బ్రూస్‌లీ కూడా డ్రాగన్ గడియల్లోనే శాన్‌ఫ్రాన్సిస్కోలో పుట్టాడు.. డెలివరీ చేసిన నర్స్ ముద్దుగా బొద్దుగా ఉన్న ఆ బాలుడిని చూసి బ్రూస్‌లీ అని పేరు పెట్టింది. తల్లిదండ్రులు ఇద్దరూ గాయకులు కావడంతో బ్రూస్‌లీ కుటుంబం కొంతకాలానికి హాంకాంగ్‌కు మకాం మార్చింది. పదమూడేళ్ల వయసుకే చైల్డ్ ఆర్టిస్టుగా మారిన బ్రూస్‌లీ దాదాపు ఇరవై సినిమాల్లో నటించాడు. ఆ సమయంలోనే యీవ్ మ్యాన్ దగ్గర కుంగ్‌పూ నేర్చుకున్నాడు. ఇంటర్ స్కూల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కొట్టాడు.
చాలా మందికి తెలియని మరో విషయం అతడో అద్భుతమైన డ్యాన్సర్ కూడా. 18 ఏళ్ల వయసులో హాంకాంగ్ చా చా ఛాంపియన్ షిప్ గెలిచాడు. సినీరంగంలో ప్రవేశించడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు.. దాంతో 100 డాలర్లు దొరకగానే అమెరికా షిప్ ఎక్కేశాడు. సియాటెల్‌లో కుంగ్‌పూ నేర్పిస్తూ వచ్చిన డబ్బుతో ఫిలాసఫీ చదువుకున్నాడు. చైనాయేతరులకు కుంగ్‌పూ నేర్పిస్తున్నాడని కొంతమంది అతడిపై దాడికి యత్నించారు. తాను ఓడితే ఇక కుంగ్‌పూ జోలికి వెళ్లనని వారికి ఛాలెంజ్ విసిరేవాడు.
ఆ తర్వాత సొంతంగా ఓ మార్షల్ ఆర్ట్ కనిపెట్టాడు. అదే వన్ ఇంచ్ పంచ్. ఫిలాసఫీ టీచర్‌గా పనిచేస్తూ లిండా అనే విద్యార్థిని పెళ్లిచేసుకున్నాడు. వారికో కుమారుడు పుట్టాడు. అతడి పేరు బ్రాండన్ లీ. కుటుంబాన్ని పోషించటం కోసం చిన్నచిన్న టీవీ సీరియళ్లలో, మూవీస్‌లో రోల్స్ చేశాడు. తర్వాత ఐదేళ్ల కొడుకు, భార్యను వెంటబెట్టుకొని హాంకాంగ్ వెళ్లి ఓ ప్రొడ్యూసర్ సాయంతో సినిమా తీశాడు. అదే ద బిగ్ బాస్. అప్పట్లో అది బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత ద గేమ్ ఆఫ్ డెత్ మూవీ తీశాడు. ఈ సినిమాతో హాంకాంగ్ చిత్ర పరిశ్రమ చరిత్రే మారిపోయింది. ఆ తరువాత ఎంటర్ ది డ్రాగన్. సినిమా పూర్తయింది కానీ.. ఓ రోజు తలనొప్పి వచ్చిందని పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాడు. పడుకున్న వ్యక్తి అలానే కోమాలోకి వెళ్లి మరణించాడు బ్రూస్‌లీ.
బ్రూస్‌లీ చెప్పిన ఓ మాటంటే నాకు చాలా ఇష్టం. దేవుడిని ఎప్పుడూ సాఫీగా సాగిపోయే జీవితాన్ని ఇవ్వమని కోరుకోవద్దు. తను పెట్టే కష్టాలను తట్టుకునే శక్తినివ్వమని అడగాలి. మీకు తెలుసా ప్రపంచంలో మిక్స్ మార్షల్ ఆర్ట్స్ ప్రారంభించింది బ్రూస్‌లీనే. అతడి కంటే గొప్ప ఫైటర్లు చాలామందే ఉండొచ్చు కానీ.. ప్రతిఒక్కరికీ అతడే స్ఫూర్తి. కొట్టే ప్రతి పంచ్ వెనుక ఓ థియరీ చెబుతాడు. అతడిలోని ఫిలాసఫీకి అందరూ ఫిదా అవుతారు. అతిచిన్న వయసులో 32 ఏళ్లకే బ్రూస్‌లీ మరణించాడు. అతని జీవితం మొత్తంలో చేసిన పని చాలా తక్కువే అయినా ప్రపంచంలోని ప్రతీ చిన్న పల్లెలోనూ బ్రూస్‌లీ పేరు తెలియని వారు ఉండరు. అదీ ఆయన గొప్పతనం'' అని బ్రూస్ లీ జీవితాన్ని పూరీ మన కళ్ల ముందు ఉంచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com