నటి రియాకు మరో షాక్‌

నటి రియాకు మరో షాక్‌

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతిపై జరుగుతున్న విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్‌ ఆత్మహత్య కేసుతో పాటు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న నటి రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీని ఎన్‌డీపీఎస్ కోర్టు అక్టోబర్ 6 వరకు పొడిగించింది. మరోవైపు నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ జరగనుంది.

డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా బాలీవుడ్ స్టార్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రియా చక్రవర్తి మేనేజర్ జయాను ఎన్సీబీ అధికారులు విచారించిన సమయంలో…ఆమె పలువురు స్టార్ల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె వాట్సాప్ చాట్‌లో ప్రముఖ నటి పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో మొత్తం 15 మంది ప్రముఖుల పేర్లను వెల్లడించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరందరికి ఎన్‌సీబీ సమన్లు జారీ చేసి విచారించనుంది.

జూన్ 14న ముంబయిలోని తన స్వగృహంలో సుశాంత్ ఆనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. డిప్రెషన్‌తో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి. అయితే సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, హత్య అని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా తన కుమారుడి అకౌంట్‌ నుంచి రియా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిందని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది.

ఇక ఈ కేసులో ముంబయి పోలీసులు సరైన విచారణ జరపడం లేదని, దీన్ని సీబీఐకి అప్పగించాలంటూ అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించింది. ఇక ఈ కేసులో డ్రగ్స్ కోణం కూడా బయటపడటంతో ఎన్సీబీ రంగంలోకి దిగింది. ప్రస్తుతం సుశాంత్ కేసును సీబీఐ, ఈడీ, ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story