Siddhanth Kapoor: బాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో స్టార్ హీరోయిన్ సోదరుడు..

Siddhanth Kapoor: సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసులు అనేవి ఎంత అదుపులోకి తీసుకురావాలని ప్రయత్నించినా.. అలాంటివి ఏవో ఒకటి బయటపడి ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై కోర్టులో విచారణ జరుగుతూ ఉండగా.. ఇటీవల బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌తో దుమారం రేగింది. తాజాగా మరో స్టార్ హీరోయిన్ సోదరుడిని కూడా డ్రగ్స్ కేసులో అదుపులో తీసుకున్నారు పోలీసులు.
ఆదివారం రాత్రి బెంగళూరులోని ఓ హోటల్‌లో రేవ్ పార్టీ జరిగింది. పోలీసులకు దీని గురించి సమాచారం అందడంతో వారు ఆ హోటల్‌పై దాడి చేశారు. అక్కడ పలువురు డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఇక అందులో ఒకరు ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమారుడు, యంగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్.
సిద్ధాంత్ కపూర్‌తో పాటు మరో అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయంపై శక్తి కపూర్ స్పందిస్తూ.. ఇది నమ్మశక్యంగా లేదని, ఇలా జరిగే ఛాన్సే లేదని అన్నారు. తన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదని కేవలం అదుపులోకి మాత్రమే తీసుకున్నారని తెలిపాడు. ఇక సిద్ధాంత్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పలు చిత్రాల్లో నటుడిగా మెప్పించగా మరికొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com