సుశాంత్ మృతి కేసులో మరో ట్విస్ట్.. ఆమెపై ఫోర్జరీ కేసు పెట్టిన రియా

సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణంపై NCB అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని రెండోరోజు విచారించారు. దాదాపు 8 గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. మంగళవారం కూడా విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేశారు. అయితే సోమవారం రియాను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాను డ్రగ్స్ తీసుకొచ్చేదాన్ననని.. తానెప్పుడూ వాడలేదని రియా తెలిపినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని NCB అరెస్ట్ చేసింది. రియా చక్రవర్తి విచారణకు సహకరిస్తున్నారని అధికారులు వెల్లడించారు.
సుశాంత్ మరణం కేసు విచారణ అనేక ఆసక్తికర కోణాల్లో పయనిస్తోంది. ఆత్మహత్య గురించి ఎంక్వైరీ చేస్తే డ్రగ్స్ డొంకలు కదులుతున్నాయి. బాలీవుడ్ స్టార్ల ప్రమేయంపై రియా నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 18 నుంచి 19 మంది స్టార్ల పేర్లు ఎన్‌సీబీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఎవరెవరి పేర్లు రియా వెల్లించిందనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. అటు.. సుశాంత్‌కు మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు ఉందా? లేదంటే రియా చక్రవర్తి అలవాటు చేసిందా? అన్న విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. సుశాంత్ మృతి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్‌పై రియా చక్రవర్తి ఫోర్జరీ కేసు పెట్టింది. సుశాంత్‌కు సంబంధించి బోగస్ మెడికల్ ప్రిస్క్రిప్షన్‌ను ఇచ్చిందంటూ ఫిర్యాదు చేసింది. ఈ ప్రిస్క్రిప్షన్ వచ్చిన ఐదు రోజుల్లోనే సుశాంత్ చనిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి చెందిన డాక్టర్ తరుణ్ కుమార్‌పై కూడా ఆరోపణలు చేసింది. బోగస్ ప్రిస్క్రిప్షన్‌లతో సుశాంత్‌కు వైద్యం చేశారని... ఈ నేపథ్యంలో ప్రియాంక, తరుణ్ తదితరులను విచారించాల్సిన అవసరం ఉందని రియా తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com