నేషనల్‌ పార్కులో నిత్యం చీతాల మరణాలు

నేషనల్‌ పార్కులో నిత్యం చీతాల మరణాలు

కునో నేషనల్‌ పార్కు నిత్యం చీతాల మరణాలు సంభవిస్తున్నాయి. 70 ఏళ్ల తర్వాత భారత్‌లో ప్రవేశించిన చీతాలకు మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కు చితిలా మారింది. అక్కడి వాతావరణం భిన్నంగా ఉండటంతో చీతాలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. అరుదైన చీతాలకు ప్రాణ సంకటంగా మారింది. కేఎన్‌పీలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 46-47 డిగ్రీలు నమోదవు తుండ టంతో చీతాలు అలమటించిపోతున్నాయి.ఇక కేఎన్‌పీలోనే రెండు నెలల క్రితం జన్మించిన చీతా కూనలు పిట్టల్లా రాలిపోతున్నాయి. చీతాలకు కునో అనువైన ప్రాంతం కాదని, వాటిని వెంటనే రాజస్థాన్‌ కు తరలించాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సూచించినా, వన్యప్రాణి నిపుణులు నెత్తీనోరూ కొట్టుకొని మొత్తు కొంటున్నా.. కేంద్రం మాత్రం మొండిపట్టు విడువటం లేదు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం లో ఉండటం వల్లనే చీతాలను అక్కడికి తరలించేందుకు విముఖతచూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికా నుంచి 12, నమీబియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానాల్లో తెచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో వదిలారు ప్రధాని మోదీ. అయితే కేఎన్‌పీ అనువైన ప్రాంతం కాదని వన్యప్రాణి సంరక్షణ నిపుణులు హెచ్చరించారు. మార్చి 27న సాశ, ఏప్రిల్‌ 23న ఉదయ్‌ మరణించాయి. మే 9న దక్ష అనే ఆడ చీతా గాయాలతో చనిపోయింది. కేఎన్‌పీలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరటంతో చీతాలు తట్టుకోలేకపోతున్నాయి. జ్వాల అనే చీతా నాలుగు కూనలకు జన్మ నిచ్చింది. వేసవి తాపానికి తాళలేక మూడు రోజుల క్రితం అందులో మూడు కూనలు మరణించాయి.

మరోవైపు అంతరించిపోయిన చీతాల్ని అడువుల్లో తిరిగేలా చేయటానికి గత యూపీఏ ప్రభుత్వ హయాం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. దక్షిణాఫ్రికా,నమీబియా నుంచి చీతాలను తెప్పించేందుకు ఆయా దేశాలతో ఒప్పందాలు జరిగాయి. ఎన్డీయే హయాంలో 20 చీతాలను తెచ్చి కునోలో వదిలారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి 70 కోట్లు ఖర్చయ్యింది.50 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ భరించింది. చీతాలను ఎక్కడ ఉంచాలన్న అంశంపై పర్యావరణవేత్తలు, వన్యప్రాణి నిపుణులు చేసిన పలు సూచనలు కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని కేఎన్‌పీలో వాటిని వదిలారు. ఇక్కడి అడవి విస్తీర్ణం చాలా తక్కువ. కేఎన్‌పీ చుట్టూ గ్రామాలున్నాయి. అడవిలో మానవ సంచారం కూడా ఎక్కువే. దీంతో చీతాల మనుగడకు ఈ అడవి అసలు పనికిరాదని నిపుణులు అంటున్నారు.

Read MoreRead Less
Next Story