ఏపీలో హీటెక్కిన రాజకీయాలు

ప్రకాశం జిల్లాలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ బుసలు కొడుతున్నాయా? ముఠాకక్షల్లో భాగంగానే టంగుటూరులో టీడీపీ మహిళా కార్యకర్తను చంపారా? ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీలో రాజకీయాలు అమాంతం హీటెక్కిపోతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కొండపిలో అధికార పార్టీ అగ్గి రాజేసింది. రౌడీ రాజకీయాలకు తెరలేపింది. వైసీపీకి నిద్ర లేకుండా చేస్తున్న కొండపి ఎమ్మెల్యే స్వామిని టార్గెట్ చేయడంతో.. నియోజకవర్గంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియడం లేదు. వైసీపీ ఛలో నాయుడుపాలెం అనడం.. దీనికి ప్రతిగా టీడీపీ ఛలో టంగుటూరు అనడంతో.. రోజంతా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందంటూ టీడీపీ విరుచుకుపడుతోంది.
పోటాపోటీ ర్యాలీలతో టంగుటూరు హోరెత్తింది. ర్యాలీ సమయంలో టీడీపీ కార్యకర్తను ఓ ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హనుమాయమ్మ అనే కార్యకర్త స్పాట్‌లోనే మృతి చెందారు. అయితే వైసీపీ నేతలే ట్రాక్టర్‌తో హనుమాయమ్మను ఢీ కొట్టారని టీడీపీ నేతల ఆరోపిస్తున్నారు. వైసీపీకి చెందిన మాలకొండయ్య ట్రాక్టర్‌తో ఢీ కొట్టడం వల్లే హనుమాయమ్మ మృతి చెందారంటున్నారు. మృతురాలి భర్త సుధాకర్ టంగుటూరు మండల ఎస్సీ సెల్‌లో కీలక నేతగా ఉన్నారని.. వైసీపీ ఇన్‌ఛార్జ్ అశోక్ బాబు కక్షపూరితంగానే హత్య చేయించారని ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. హత్యను యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తున్నారని.. ఫోన్‌లో ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే స్వామి. ఇక హనుమాయమ్మ మృతితో కొండేపిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండడంతో.. ఎమ్మెల్యే స్వామి వైసీపీ టార్గెట్‌గా మారారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ నిధులను టీడీపీ ఎమ్మెల్యే స్వామి దుర్వినియోగం చేశారంటూ.. వైసీపీ ఇన్‌ఛార్జ్ అశోక్‌బాబు చలో నాయుడుపాలెం అంటూ పిలుపునిచ్చారు. దీనికి కౌంటర్‌గాచలో టంగుటూర్ కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేను.. కార్యకర్తలను అడ్డుకున్నారు. వాగ్వాదాలు.. తోపులాటలు.. చివరికి ఎమ్మెల్యే స్వామి చొక్కా చిరిగిపోవడం వరకు పరిస్థితి వచ్చింది. పోలీసులు వైసీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌ఛార్జ్ అశోక్‌బాబు రౌడీయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీ రాజకీయాన్ని ఇకపై సహంచబోమని హెచ్చరించారు.
అటు.. టంగుటూరులో ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే టీడీపీ కార్యకర్తను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపారనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ నేతలే ట్రాక్టర్‌తో హనుమాయమ్మను ఢీ కొట్టారని టీడీపీ నేతల అంటున్నారు. వైసీపీ ఇన్‌ఛార్జ్ అశోక్ బాబు కక్షపూరితంగానే హత్య చేయించారని ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఆరోపిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజమే.. కానీ వైసీపీ నేత అశోక్‌బాబు పదేపదే టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునివ్వడం.. కొండపి నియోజకవర్గంలో అశాంతి సృష్టిస్తోందంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి వైసీపీ నేతలు కొండపి రాజకీయం మరింత హీటెక్కిస్తారా.. లేక ఓ అడుగు వెనక్కి తగ్గుతారా? చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com