జగన్ పాలనలో రైతాంగం అవస్థలు పడుతోంది : నారా లోకేష్

వ్యవసాయంపై అవగాహన లేని జగన్ పాలనలో రైతాంగం అవస్థలు పడుతోందన్నారు నారా లోకేష్. బనగానపల్లె నియోజకవర్గం సౌదరదిన్నె గ్రామ రైతులు లోకేష్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. గత ఎన్నికల సమయంలో 3వేల 500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పిన జగన్.. మాట తప్పారని లోకేష్ మండిపడ్డారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతుల్ని కనీసం పలకరించే నాథుడే కరువయ్యాడన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 3వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గతంలో రైతాంగానికి అమలుచేసిన పథకాలన్నింటినీ పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు.
ఏపీలో జగన్ మైనింగ్ కార్పొరేషన్ తప్ప.. వేరే మైనింగ్ కంపెనీ లేకుండా చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బనగానపల్లె నియోజకవర్గం అముదాలమెట్ట శివారులో మైనింగ్ యజమానులు, కార్మికులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులు లాక్కున్న మైన్స్ అన్నీ వెనక్కి తీసుకొని.. తిన్న డబ్బు అంతా కక్కిస్తామని లోకేష్ తెలిపారు. జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. వైసీపీ పాలనలో మైనింగ్ యజమానులు, కార్మికులు నరకం అనుభవిస్తున్నారని.. దాదాపు 30 లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని అన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమని.. మైనింగ్ యజమానులు, కార్మికుల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మైనింగ్‌ని ఇండస్ట్రీగా గుర్తించి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేస్తామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com