ప్రజల్ని మభ్య పెట్టి అధికారాన్ని దక్కించుకున్న సీఎం జగన్

ప్రజల్ని మభ్య పెట్టి అధికారాన్ని దక్కించుకున్న సీఎం జగన్

అంతన్నాడు... ఇంతన్నాడు.! అధికారంలోకి రాగానే పోలవరం పూర్తి చేసి చూపిస్తానన్నాడు. ప్రజల్ని మభ్య పెట్టి అధికారాన్ని దక్కించుకున్న సీఎం జగన్.... ఇన్నాళ్లు ప్రాజెక్టు ఊసే మర్చిపోయాడు. నాలుగేళ్లలో అప్పుడుప్పుడు మంత్రులతో ఏడాది కొక టార్గెట్‌ పెట్టి ఏపీ ప్రజల్ని ఆశల్లో ముంచెత్తాడు. ఈ నాలుగేళ్లలో కేవలం నాలుగంటే నాలుగేసార్లు పర్యటించిన జగన్‌కు... ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ పోలవరం గుర్తొచ్చింది. దీంతో ఐదోస్సారి ప్రాజెక్టును పరిశీలించేందుకు రెడీ అయ్యారు సీఎం జగన్‌.

దాదాపు రెండేళ్ల తర్వాత.... పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు ప్రాంతాలను పరిశీలించబోతున్నారు. సీఎం హోదాలో ఆయనకు ఇది ఐదో పర్యటన. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2019 జూన్‌ 20వ తేదీన, అదే ఏడాది నవంబరు 4న, 2020 డిసెంబరు 12న, 2021 జూలై 19న పోలవరం ప్రాంతంలో జగన్‌ పర్యటించారు. అయితే, ఆయన వచ్చిన ప్రతిసారీ నిర్వాసితులు కలవకుండా ఆంక్షలు విధించారు పోలీసులు. ఇవాళ కూడా వెయ్యిమంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు,పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పోలీసులను బస్సుల్లో తరలించారు. దీంతో పోలవరం ప్రాంతంలో ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. మొత్తానికి భారీ కట్టుదిట్టమైన భద్రత మధ్య సీఎం జగన్‌ పర్యటన కొనసాగనుంది.

ఇక.... ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం 2007లో సేకరించిన భూములకి అదనంగా 5 లక్షల పరిహారం చెల్లిస్తామని ఎన్నికలకు ముందు జగన్‌ చెప్పారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి 10 లక్షల వ్యక్తిగత పునరావాస పరిహారం చెల్లిస్తామని 2016 జూలై 13న కుక్కునూరులో హామీలు ఇచ్చారు. భూములకు అదనంగా పరిహారం చెల్లిస్తామన్నారు. కేవలం జీవోలకే పరిమితమయ్యారు తప్ప ఇప్పటివరకు ఆ హామీ అమలు చేయలేదు. అంతేకాదు నిర్వాసితుల కోసం టీడీపీ ప్రభుత్వం అగ్గిపెట్టె లాంటి ఇళ్లు కడుతోందని, మనిషన్న వాడు ఎవడైనా ఆ ఇళ్లలో కాపురం చేయగలడా అని అప్పట్లో ప్రశ్నించారు. తాను అధికారంలోకి వచ్చాక పెద్ద పెద్ద ఇళ్లు నిర్మించి ఇస్తానని హామీలిచ్చారు. కానీ టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లనే ఇప్పుడు నిర్వాసితులకు ఇస్తోంది జగన్‌ సర్కారు. దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు పోలవరం నిర్వాసితులు. 41.15 కాంటూరు పరిధిలో ఎలాంటి ముంపు గ్రామాలు ఉండవని తెలిపిన ప్రభుత్వం గతేడాది వరదలకు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో ముంపునకు గురైన వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మాటతప్పను మడమతిప్పను అని ప్రతిపక్షనేతగా జగన్‌ ఇచ్చిన ఏఒక్క హామీ అమలు చేయలేదంటూ మండిపడుతున్నారు.

గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు.... ప్రతి సోమవారం పోలవారంగా ప్రకటించి ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని వేగవంతం చేశారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో... అనేక సార్లు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు చంద్రబాబు. ఈ కారణంగా... దాదాపు 72 శాతానికి పైగా పనులు పూర్తి చేయగలిగారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.... నాలుగేళ్లలో నాలుగుసార్లు మాత్రమే పర్యటించారు. ఇవాళ ఐదో సారి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తున్నారు. నిర్వాసితులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా.. ఇప్పటివరకు ప్రాజెక్టును పూర్తి చేయలేదు. అటు కేంద్రం సైతం పోలవరం ప్రాజెక్టుకు 13 వేల కోట్లు మంజూరు చేసింది. డ్యాంలో 45.72 మీటర్ల ఎత్తున నీరు నిలబెట్టేలా నిర్మించేందుకు ఈ నిధులను ఉపయోగించాలి. డయాఫ్రం వాల్‌ మరమ్మతులు, ప్రధాన డ్యాం రిపేర్లకు కలిపి 17వేల కోట్లు అవసరమని పోలవరం అథారిటీకి ఏపీ అధికారులు లేఖ రాయడంతో కేవలం 13 వేల కోట్ల మంజూరుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మరి ఇప్పటికైనా.... ఈ ప్రాజెక్టను పూర్తి చేస్తారా? గతంలో ఇచ్చినట్లు నిర్వాసితులకిచ్చిన హామీలు నెరవేరుస్తారా అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story