AP : రోగులతో జగన్ సర్కార్ చెలగాటం

రోగులతో జగన్ సర్కార్ చెలగాటమాడుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వైద్య సేవలు ఆపేస్తామని నెట్‌వర్క్ ఆస్పత్రులు నోటీసు ఇవ్వడంతో దెబ్బకు దిగొచ్చింది ఏపీ సర్కార్. మొత్తం బకాయిల్లో కొంత భాగం విడుదల చేసింది.మొత్తం బకాయిలు 1200 కోట్లు ఉండగా.. ఆగమేఘాల మీద 368 కోట్లు విడుదల చేసింది సర్కారు.రెండు వారాల్లో మరో 400 కోట్ల విడుదలకు హామీ ఇచ్చింది.ఈహెచ్‌ఎస్ బిల్లులు 8 నెలలు..ఆరోగ్యశ్రీ బిల్లులు 9 నెలలుగా పెండింగ్‌లో పెట్టింది జగన్ సర్కార్.దీంతో పేద, మధ్య తరగతి రోగులు అవస్థలు పడుతున్నారు. 2022 జూలై తర్వాత ఆరోగ్య పథకం బిల్లులు చెల్లించక పోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు వైద్య సేవలు ఆపేస్తామని హెచ్చరించడంతో రంగంలోకి దిగిన ట్రస్ట్ సీఈవో హడావిడిగా నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పాక్షికంగా నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక వందల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో పెట్టడం...నెట్‌వర్క్ ఆస్పత్రులు వైద్య సేవలు ఆపేస్తామని హెచ్చరించడం... ట్రస్ట్ అధికారులు హడావిడి చేయడం...ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేయడం.. ఇలా సర్కార్,నెట్‌వర్క్ ఆస్పత్రుల మధ్య జరుగుతున్న దోబూచులాటతో పేదలు నలిగిపోతున్నారు.బకాయిలు చెల్లించలేదంటూ ప్రభుత్వానికి ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు అల్టిమేటం ఇచ్చాయి. ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులు అల్టిమేటం ఇవ్వడమనేది అత్యంత హాస్యాస్పదమైన వ్యవహారం.దీంతో పేద, మధ్య తరగతి రోగులు అవస్థలు పడుతున్నారు. ఇదే సీన్ పదే పదే రిపీట్ అవుతుంది.
ఇక నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ గత నెల 21వ తేదీన ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది. 2022 జూలై తర్వాత ఉద్యోగుల ఆరోగ్య పథకం బిల్లులు చెల్లించలేదని, ఆగస్టు 2022 తర్వాత ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయాలని ఆ లేఖలో తెలిపారు. తమకు ఈహెచ్‌ఎస్ బిల్లులు వచ్చి 8 నెలలు, ఆరోగ్యశ్రీ బిల్లులు వచ్చి 9 నెలలు అయ్యిందని వివరించారు. ఆరోగ్యశ్రీకి తమ ఆస్పత్రుల్లో 30 శాతం మంచాలు ఉపయోగిస్తున్నామని, ఆ బిల్లుల చెల్లింపు తమ ఆస్పత్రులకు చాలా అవసరమని అభ్యర్థించారు. ట్రస్ట్ నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన ప్రయోజనాలన్నీ ఇవ్వాలని, లేకుంటే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు చేయలేమని తేల్చిచెప్పారు.
మరోవైపు ప్రభుత్వం,నెట్‌వర్క్ ఆస్పత్రుల మధ్య నడుస్తున్న వ్యవహారంతో పేద,మధ్య తరగతి వారు ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడుతున్నారు. అటు ఆరోగ్యశ్రీ సీఈవో దృష్టికి తెచ్చాయి ఆస్పత్రుల యాజమాన్యాలు.ముఖ్యంగా ప్యాకేజీలు పెంచాలని,పది సంవత్సరాల క్రితం చేసుకున్న ఒప్పందాల ప్రకారమే ప్యాకేజీలను అమలు చేస్తున్నారని.. ఈ అంశంపై పలుసార్లు సీఎం దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేదని లేఖ రాశాయి. ఆపరేషన్ల సమయంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించాలని కోరాయి.వీటితో పాటు ఆరోగ్యశ్రీ పథకం అమలులో అనేక లోపాలు ఉన్నాయని చెపుతూ నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యం ఆరోగ్యశ్రీ సీఈవోకు రాసిన లేఖలో తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com