ఎన్నికలకు 6 నెలలే.. టికెట్ల విషయం ఏం చెప్పలేం: కేటీఆర్

ఎన్నికలకు 6 నెలలే.. టికెట్ల విషయం  ఏం చెప్పలేం: కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని.. టికెట్ల విషయం ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు మంత్రి కేటీఆర్‌. మంచి పనితీరు కనబర్చినవారికే ఎమ్మెల్యే టికెట్లు.. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపర్చుకోవాలని సీఎం అంటున్నారని చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందన్న కేటీఆర్‌.. 90 నుంచి 100 స్థానాల్లో సులభంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి కేసీఆర్‌ సీఎం అవుతారని అన్నారు. దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని సవాల్‌ విసిరారు. ఇక.. తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాలలో నీళ్లు, నిధులు, నియామకాలన్న స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తుందని కేటీఆర్‌ వెల్లడించారు. అందులో విజయం సాధించిందని.. సమగ్ర, సమతుల్య, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధిని సాధించిందని.. విద్యా వైద్య రంగంలో తెలంగాణ అద్భుతమైన మార్పులు తీసుకురాగలిగిందన్నారు. వైద్య రంగంలో నూతన వైద్యశాలలో మెడికల్ కాలేజీలతో సమగ్రమైన మార్పు చెందిందని.. నూతన పాఠశాలలు, గురుకులాల ఏర్పాటు, మన ఊరు మన బడి వంటి కార్యక్రమాల ద్వారా విద్యారంగంలో గుణాత్మకమైన మార్పు సాధ్యమైందన్నారు.

గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, అగ్రవర్గాలు, అణగారిన వర్గాలు.. ఇలా ఎలాంటి భేదం లేకుండా సమ్మిళిత అభివృద్ధి జరుగుతుందన్న ఆయన.. తెలంగాణలో పరిపాలన సంస్కరణలు దేశంలో ఎక్కడా లేనంత వేగంగా ముందుకు పోతున్నాయని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ తనదైన మార్క్ వేయగలిగిందని.. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనేది ఈ రోజు నినాదంగా మారిందని అన్నారు. ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిందని విమర్శించారు. ప్రతిపక్షాలకు పనిలేక తొమ్మిది ఏళ్లుగా అసత్య ఆరోపణలతో వాగుతున్నారని.. ఒక్కసారి కూడా హేతుబద్దంగా, రుజువులతో మాట్లాడలేకపోయారన్నారు. చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరన్న విశ్వాసం ఉందని.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలన.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిపాలనను బేరీజు వేసుకోవాలని సూచించారు.

దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణ కన్నా ఉత్తమ పరిపాలన తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలో అందిస్తున్నామని చెప్పాలని సవాల్‌ విసిరారు. తెలంగాణ కన్నా మంచి మోడల్ చూపించాలన్నారు. ఈ రెండు పార్టీలు 75 సంవత్సరాల్లో చేయని పనిని, కేవలం 9 సంవత్సరాల్లో చేసి చూపించామని కేటీఆర్‌ అన్నారు. ఆ రెండు పార్టీల పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరి ఉంటుందని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రులు టాయిలెట్స్, రైల్వేస్టేషన్లలోని లిఫ్ట్‌లు ఓపెన్ చేస్తున్నారని.. తాము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ తెలంగాణ రాష్ట్రం మైనార్టీలకు చేసిన కార్యక్రమాల గురించి.. ఇతర రాష్ర్టాల్లో గొప్పగా చెప్పిన విషయం మర్చిపోవద్దన్నారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది ఆ పార్టీ ఇష్టమని.. ప్రజలు మత ప్రాతిపదికనే ఓట్లు వేస్తారని తాను నమ్మనని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారని నమ్ముతున్నానని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేనే లేదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనేది తన వాదన కాదని.. జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నదే తమ వాదన అని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో అన్ని రాష్ట్రాలకు సమానమైన అవకాశాలు ఉండాలని.. ఒక్క యూపీ లాంటి రాష్ట్రంలో పెరిగే సీట్లు మొత్తం దక్షిణాది రాష్ట్రాల సీట్ల కన్నా ఎక్కువగా ఉండన్నాయన్నారు. దేశ ప్రగతికి మద్దతు ఇచ్చిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదని.. అలాంటి పరిస్థితి వస్తే ఎవరూ సహించరని అన్నారు. ఇప్పటి నుంచే లోక్‌సభ స్థానాలు పెంపు పైన ఆరోగ్యవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మంచి విధానాలను ఇతర రాష్ట్రాలలో అమలు చేయాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. రాహుల్ గాంధీ ఒక పార్టీ కాకుండా ఎన్జీవో లేదా దుకాణాన్ని నడపాలని దుయ్యబట్టారు. తమ పార్టీకి కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేసే హక్కు ఉందని.. ఆ దిశగా ఆలోచిస్తున్నామని అన్నారు. ఏపీ పని ప్రారంభించామని చెప్పారు. ధరల పెరుగుదల నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో విఫలమైన మోదీ ప్రభుత్వం గద్దె దిగాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీకి దమ్ముంటే దేశానికి చేసిన మంచి పనుల గురించి ప్రజల్లో చర్చ పెట్టాలని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసం తాము విదేశీ పర్యటనలు చేసి ఉద్యోగాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని.. తాజా పర్యటనలో 42 వేల ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణకు తెచ్చామని పేర్కొన్నారు. సచివాలయ నిర్మాణం, వ్యాక్సిన్ల తయారీ లాంటి అంశాల నుంచి మెదులుకొని అన్నింట్లో ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్ టెండర్ ప్రక్రియ, జాతీయ రహదారుల టెండర్ ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందన్నారు. చిల్లర మాటలు చిల్లర ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలు ఇప్పటికైనా మానుకోవాలని హెచ్చరించారు. నోట్లు రద్దుతో ఏం సాధించారో ఇప్పటిదాకా మోదీ ప్రజలకు సమాధానం చెప్పలేదని.. ఇప్పుడు 2వేల నోట్ల మార్పిడితో సాధించేది ఏంటో కూడా ప్రజలకు చెప్పడం లేదన్నారు.

Tags

Next Story