ADANI CASE: ఆదానీ కేసు.. అమెరికాకు తప్పని ఆటంకాలు

ప్రముఖ వ్యాపారవేత్త, భారత కుబేరులలో ఒకరైన గౌతమ్ అదానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం పదేళ్లలో భారత్‌లోనే కాదు.. ప్రపంచం సంపన్నుల జాబితాలో చేరిన ఏకైక వ్యక్తి. అతి తక్కువ కాలంలో అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందారు. అయితే, గౌతమ్ అదానీ ఎంత వేగంగా ఎదిగాడో.. అంతే వేగంగా పడిపోయాడు. గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. తప్పుడు లెక్కల ఆరోపణలతో దాదాపు ఏడాది పాటు అదానీ షేర్లు కుప్పకూలాయి. రూ.లక్షల కోట్ల నష్టం జరిగింది. తర్వాత అదానీపై నమోదైన లంచం కేసు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 2024 నవంబర్‌లో నమోదైన ఈ కేసులో సౌర విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం భారత రాజకీయ నాయకులకు రూ.2,029 కోట్ల లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.
అమెరికాలో కేసులు
అమెరికా న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో దాఖలైన ఈ కేసు, అదానీ గ్రూప్ సంస్థ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ, అమెరికా పెట్టుబడిదారుల నుంచి నిధులు సమీకరించడంలో మోసపూరిత ప్రకటనలు చేసినట్లు ఆరోపిస్తోంది. ఈ నిధులను ఉపయోగించి, భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చి, సౌర విద్యుత్ కాంట్రాక్టులను సాధించినట్లు ఎస్ఈసీ పేర్కొంది. ముఖ్యంగా, ఏపీలో జగన్మోహన్రెడ్డి హయాంలో వివిధ నాయకులకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
విచారణకు ఆటంకాలు
ఈ కేసులో గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతో సహా ఎనిమిది మందిపై న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం నేరారోపణలు మోపింది. అయితే, సమన్లు జారీ చేయడంలో ఎస్ఈసీ సవాళ్లను ఎదుర్కొంటోంది.హేగ్ సర్వీస్ కన్వెన్షన్ కింద భారత న్యాయశాఖ ద్వారా సమన్లను అందజేయాల్సి ఉన్నప్పటికీ, అహ్మదాబాద్ కోర్టుకు పంపిన ఈ సమన్లపై ఎలాంటి స్పందన రాలేదు. 2025 ఆగస్టు నాటికి నాలుగు నెలలు గడిచినప్పటికీ, సమన్లు అందలేదని ఎస్ఈసీ తన రిపోర్టులో తెలిపింది. ఈ జాప్యానికి ప్రభుత్వం అదానీతో ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమని ఆరోపణలు వస్తున్నాయి.
భారత ప్రభుత్వం సహకారం లేకనే?
ఈ కేసు భారత ప్రభుత్వం, అదానీ గ్రూప్ మధ్య సంబంధాలపై తీవ్ర చర్చను రేకెత్తించింది. ఎస్ఈసీ పదేపదే భారత న్యాయశాఖ సహకారం కోరినప్పటికీ, ఎలాంటి స్పందన లేకపోవడం విమర్శలకు దారితీసింది. భారత ప్రభుత్వం అదానీని రక్షించేందుకు ఉద్దేశపూర్వకంగా సహకరించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు, రాజకీయ నాయకులతో అదానీ గ్రూప్స్‌తో సన్నిహిత సంబంధాలను మరింత ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కు లింకు..
ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన రావడం రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపింది. 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, రూ. 1,750 కోట్ల లంచం వివిధ నాయకులకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు రుజువైతే, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా విచారణలోకి రావచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసును మొదట ఏపీలోని కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తర్వాత కేంద్రం ఒత్తిడితో సైలెంట్ అయింది. ఈ కేసు కేవలం అదానీ గ్రూప్‌కు మాత్రమే కాకుండా, భారత వ్యాపార రంగంలో అంతర్జాతీయ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com