Adani Group : భారీ నష్టాల్లో అదానీ గ్రూప్ షేర్లు

అదానీ గ్రూప్‌పై మళ్ళీ స్టాక్ మార్కెట్‌లో కలకలం మొదలైంది. అదానీ గ్రూప్‌పై గతంలో అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చి అనే సంస్థ విడుదల చేసిన నివేదిక స్టాక్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. ఇవాళ భారత్‌కు చెందిన బిజినెస్ పోర్టల్ ద కెన్ రాసిన ఓ విశ్లేషణాత్మక కథనంతో అదానీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. అదానీ గ్రూప్‌లోని అన్ని షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి. బ్లూచిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజస్ 7 శాతం క్షీణించగా, అదానీ పోర్ట్స్ 5 శాతంపైగా నష్టపోయింది.
అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్, అదానీ విల్మర్ షేర్లలో కొనుగోలు దారులు లేరు. అలాగే ఏసీసీ, అంబుజా సిమెంట్ షేర్లు కూడా నష్టాల్లో ముగిశాయి. నిన్న ఈ షేర్ల విలువ 30 వేల కోట్ల రూపాయలు తగ్గింది. ఇవాళ మరో 58 వేల కోట్ల రూపాయలు తగ్గింది. పెద్ద రుణాలు తిరిగి చెల్లించేశామంటూ అదానీ అబద్ధం చెబుతున్నారని ద కెన్ పోర్టల్ ఇవాళ రాసింది. బ్యాంకులకు 215 కోట్ల డాలర్ల అప్పులు తీర్చేశామన్న అదానీలు ఇటీవల ప్రకటించారు. తమ షేర్లను తాకట్టు పెట్టి ఈ రుణాలను గతంలో అదానీ కంపెనీలు తీసుకున్నాయి. అయితే ఈ షేర్లు ఇంకా బ్యాంకుల వద్ద తాకట్టులో ఉన్నాయని...రుణాలకు సంబంధించి అదానీ గ్రూప్ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తోందని ద కెన్ పేర్కొంది. దీంతో అదానీ షేర్లలో పతనం మళ్ళీ మొదలైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com