Adani Group: అదానీ గ్రూపునకు మళ్లీ ఆరోపణల సెగ

అదానీ గ్రూపునకు మళ్లీ ఆరోపణల సెగ తాకింది. ప్రమోటరు కుటుంబానికి చెందిన సంబంధీకులపై ఈ కొత్త ఆరోపణలు వచ్చాయి. 2013 నుంచి 2018 వరకు అదానీ గ్రూపు కంపెనీల షేర్ల విలువలను గణనీయంగా పెంచేందుకు మారిషస్‌కు చెందిన అజ్ఞాత పెట్టుబడి సంస్థలను ఉపయోగించి వీళ్లు రహస్యంగా లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది.
ఇక ప్రమోటరు కుటుంబ భాగస్వాములు నిర్వహిస్తున్న మారిషస్‌కు చెందిన రెండు పెట్టుబడి ఫండ్‌లు ఈ రహస్య పెట్టుబడుల ప్రక్రియను నిర్వహించాయంటూ తమకు లభించిన పత్రాల్లోని వివరాల ఆధారంగా ఓసీసీఆర్‌పీ నివేదిక వెల్లడించింది. 2013- 2018 మధ్య కాలంలో అదానీ గ్రూపులోని నమోదిత కంపెనీల షేర్లు గణనీయంగా పెరగడంతో పాటు అత్యంత శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది.మారిషస్ బేస్డ్ ఫండ్‌లు నిర్వహించిన ఈ పెట్టుబడుల ప్రక్రియతో అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడైన వినోద్ అదానీకు సన్నిహితులైన ఇద్దరు బాగా లబ్ధి పొందినట్లు ఓసీసీఆర్‌పీ తెలిపింది.
అదానీ గ్రూపు స్టాక్ మార్కెట్‌లో అనుమానిత ట్రేడింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోందంటూ 2014 ప్రారంభంలో సెబీ ఓ ఆధార పత్రాన్ని బహిర్గతపర్చిన విషయాన్ని కూడా ఓసీసీఆర్‌పీ గుర్తుచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com