Adani Group: నష్టాల బాటలో అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ మళ్లీ నష్టాల బాట పట్టింది. 10 షేర్లూ నష్టాల పాలయ్యాయి. దీంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు దాదాపు 7శాతం పతనమైంది. దేశీయ మార్కెట్ల ధోరణితో పాటు లాభాల స్వీకరణా ఒక కారణంగా నిలిచింది. మరోవైపు అదానీ గ్రూప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన అమెరికాకు చెందిన సంస్థాగత మదుపుదార్ల నుంచి... ఆ దేశ నియంత్రణ సంస్థలు సమాచారాన్ని కోరాయన్న వార్తలు మరో కారణంగా నిలిచాయి.
అదానీ గ్రూప్ తమ కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచిందంటూ హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ విషయమై అమెరికా సంస్థాగత పెట్టుబడిదార్లకు అదానీ గ్రూప్ ఏం వివరణ ఇచ్చిందన్న దానిపై అమెరికా నియంత్రణ సంస్థలు దర్యాప్తు మొదలుపెట్టాయని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఎస్‌ఈసీ దర్యాప్తు చేస్తోందనీ బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఇక వీటి వల్ల క్రిమినల్, సివిల్ విచారణ జరగాలనేమీ లేదని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. అమెరికా నియంత్రణ సంస్థలు పెట్టుబడిదార్లను వాకబు చేసినట్లు తమ దృష్టికైతే రాలేదన్నారు. తమ కంపెనీలు చట్టాలకు లోబడే అన్ని విషయాలను వెల్లడించాయన్న విశ్వాసం తమకుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com