AI: భవిష్యత్తు అంతా ఏఐ యుగమే

ప్రపంచ కుబేరుడు, టెస్లా (Tesla) సీఈఓ ఎలన్ మస్క్ కృత్రిమ మేధస్సు (AI) మరియు రోబోటిక్స్ కారణంగా భవిష్యత్తులో మానవ సమాజంలో రాబోయే పెను మార్పులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , హ్యుమనాయిడ్ రోబోల విస్తృతితో రాబోయే తరాల్లో 'ఉద్యోగం' అనేది కేవలం ఒక ఎంపికగా మారనుందని, అంతేకాకుండా 'డబ్బు' కూడా అసంబద్ధంగా మారనుందని ఆయన జోస్యం చెప్పారు. వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎన్విడియా సీఈఓ జెన్సెంగ్ హువాంగ్ కూడా పక్కనే ఉన్నారు. ఈ చర్చకు సంబంధించిన వీడియోను మస్క్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
ఉద్యోగం ఒక 'అభిరుచి'గా మారుతుంది
"రాబోయే 10-20 ఏళ్లలో చాలావరకు పనులు ఆప్షనల్‌గా మారనున్నాయి. ఇప్పుడు మనం క్రీడలు లేదా వీడియో గేమ్‌లు ఎలా ఆడుతున్నామో, భవిష్యత్తులో ఉద్యోగం కూడా అంతే" అని మస్క్ అన్నారు. అంటే, ఉద్యోగం అనేది జీవనోపాధి అవసరం కోసం కాకుండా, కేవలం అభిరుచిని (Passion) బట్టి చేసే ఒక కార్యకలాపంగా మారబోతుందని ఆయన ఉద్ఘాటించారు. మనుషులు తమకు ఇష్టమైన పనులను మాత్రమే ఎంచుకుంటారని, కష్టతరం అయినప్పటికీ కొందరు తమ ఇంటి పెరట్లో కూరగాయలు పండించుకోవడాన్ని ఇష్టపడొచ్చని ఉదాహరించారు.
పేదరికం ఇక 'ఇంజినీరింగ్' సమస్యే
మస్క్ వ్యాఖ్యలలో అత్యంత ముఖ్యమైన అంశం – AI ద్వారా పేదరికం నిర్మూలణ. పేదరికాన్ని సామాజిక సమస్యగా కాకుండా, కేవలం ఒక 'ఇంజినీరింగ్ సమస్య' గా మస్క్ అభివర్ణించారు. "AI మరియు రోబోటిక్స్ అనేవి ప్రాథమిక వస్తువులు, సేవల ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. తద్వారా పేదరికం పూర్తిగా అంతమవుతుంది" అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. NGOలు ఎంతో ప్రయత్నించినా సాధ్యం కాని పేదరికం నిర్మూలన, AI మరియు హ్యుమనాయిడ్ రోబోలతో సాధ్యమవుతుందని, తద్వారా అందరూ ధనవంతులుగా మారతారని ఆయన పేర్కొన్నారు. ఎలన్ మస్క్ వ్యాఖ్యలు సాంకేతిక విప్లవం తాలూకు అత్యంత ఆశాజనకమైన దృక్పథాన్ని సూచిస్తున్నాయి. AI మరియు రోబోల సామర్థ్యం పెరిగే కొద్దీ, అవి ఉత్పత్తి ఖర్చులను తగ్గిస్తాయి. ముఖ్యంగా మానవ శ్రమ అవసరమయ్యే తయారీ, రవాణా, గృహ సేవలు వంటి రంగాలలో రోబోలు కీలకం అవుతాయి. ఇది సైద్ధాంతికంగా మస్క్ చెప్పినట్లుగా సార్వత్రిక ప్రాథమిక ఆదాయం లేదా సార్వత్రిక ప్రాథమిక వస్తువులు వంటి భావనలకు దారి తీయవచ్చు. వస్తువులు ఉచితంగా లేదా అతి తక్కువ ధరకు లభిస్తే, డబ్బు విలువ తగ్గి, ఉద్యోగాల అవసరం తగ్గుతుంది. అయితే, ఈ పరివర్తన క్రమంలో అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. AI కారణంగా ఏర్పడే భారీ ఉద్యోగ నష్టాన్ని సమాజం ఎలా ఎదుర్కొంటుంది? ఈ సాంకేతికతకు యాక్సెస్ లేని దేశాలు, వర్గాలు మరింత వెనుకబడవా? AI ద్వారా ఉత్పత్తి అయిన సంపద సమానంగా పంపిణీ అవుతుందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

