ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో హైదరాబాదీ

సంక్షోభంలో ఉన్న ఎయిర్ ఇండియాను అప్పగిస్తే ఇప్పటికిప్పుడు రూ.13,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటరప్స్ సంస్థ వెల్లడించింది. ఎయిర్ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూప్‌తో పాటు ఎయిర్ ఇండియా ఉద్యోగులతో కలిసి ఇంటరప్స్ బిడ్ దాఖలు చేసింది. ఎయిర్ ఇండియా ఈక్విటీలో తమకు 49 శాతం వాటా ఇచ్చినా చాలని ఇంటరప్స్ ప్రతిపాదించింది. అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యక్తి లక్ష్మీ ప్రసాద్ పెన్షన్ ఫండ్ సంస్థనే ఇంటరప్స్. ఎయిర్ ఇండియా ఉద్యోగులతో కలిసి బిడ్ దాఖలు చేయటంతో ఈ సంస్థ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన లక్ష్మీ ప్రసాద్ 1997లో అమెరికాకు వెళ్లారు. అక్కడ కొన్నాళ్లు ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్ ఏజెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2016లో ఇంటరప్స్ అనే రిటైర్‌మెంట్ ఫండ్ సంస్థను కొన్నారు. ఈ సంస్థ ఇప్పుడు 27,000 మంది ఖాతాదారులకు చెందిన 1,080 కోట్ల డాలర్ల అంటే సుమారు రూ.80,000 కోట్లు ఆస్తులు నిర్వహిస్తోంది. వీరిలో ఎక్కువ మంది ఎన్‌ఆర్‌ఐలే. లావాసా కార్పొరేషన్, ఆసియన్ కలర్ కోటెడ్ స్టీల్, రిలయన్స్ నావల్ వంటి సంస్థలను చేజిక్కించుకునేందుకు బిడ్స్ దాఖలు చేసింది. అయితే ఇంటరప్స్ ఖాతాదారుల రిటైర్‌మెంట్ నిధుల్లో కొంత మొత్తంతో పాటు ఎయిర్ ఇండియా ఆస్తులతో నిధులు సమీకరించి నిర్వహిస్తామంటున్నారు. టాటా సన్స్ కూడా ఎయిర్ ఇండియా కోసం బిడ్ దాఖలు చేసింది. దీంతో ప్రభుత్వం ఎవరివైపు మొగ్గు చూపుతుందన్నది కీలకంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com