APPLE: యాపిల్ కొత్త సీఈవో ఎవరు..?

అత్యంత ప్రభావవంతమైన టెక్ దిగ్గజాలలో ఒకటైన యాపిల్ (Apple) సంస్థకు తదుపరి నాయకత్వం ఎవరు? ప్రస్తుత సీఈవో టిమ్ కుక్ వారసుడిగా ఎవరు రాబోతున్నారు? ఈ ప్రశ్న గత కొంతకాలంగా టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. కుక్ త్వరలో తన 65వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో, ఆయన వారసత్వ చర్చ మరోసారి ఊపందుకుంది.
సీఈవో రేసులో జాన్ టర్నస్
ఈ వారసత్వ పోరులో బలంగా వినిపిస్తున్న పేరు.. యాపిల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ జాన్ టర్నస్ (John Ternus). యాపిల్ సంస్థతో టర్నస్‌కు సుమారు 24 ఏళ్ల అనుబంధం ఉంది. ప్రస్తుతం ఆయన వయసు 50 ఏళ్లు. ఈ అంశం కూడా ఆయనకు కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. 2011లో టిమ్ కుక్ సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన వయసు కూడా 50 సంవత్సరాలే.టర్నస్ కేవలం హార్డ్‌వేర్ బాధ్యతలను మాత్రమే చూడటం లేదు. ఆయన యాపిల్ సంస్థలో కీలక నిర్ణయాలు తీసుకునే అతికొద్దిమంది ముఖ్య ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు. యాపిల్ తన యొక్క అత్యంత ప్రతిష్టాత్మక ఉత్పత్తులలో కొన్నింటిని అభివృద్ధి చేయడంలో, మార్కెట్లోకి తీసుకురావడంలో టర్నస్ కీలక పాత్ర పోషించారు. ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఉత్పత్తుల యొక్క ఇంజినీరింగ్ విభాగానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఇటీవల లండన్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో, టర్నస్ యాపిల్ నూతన ఆవిష్కరణ అయిన ఐఫోన్ ఎయిర్‌ను పరిచయం చేశారు. ఇది సంస్థలో ఆయన స్థానాన్ని, ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. సంస్థాగత మార్పులు లేదా నూతన ఉత్పత్తుల ప్రకటనల సందర్భంలో ప్రజల దృష్టిని ఆకర్షించేలా వేదికపై మాట్లాడే అవకాశం లభించడం అనేది, ఉన్నత స్థాయి నాయకత్వానికి సంకేతంగా టెక్ వర్గాలు చూస్తాయి.
టర్నస్‌కు సానుకూలం
ప్రస్తుతం యాపిల్‌లో ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో చాలామంది రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నారు.అలాగే చాలా చిన్నవారుగా ఉన్నారు. టర్నస్ వయసు (50 ఏళ్లు) యాపిల్ సీఈవోగా సుదీర్ఘకాలం పనిచేయడానికి సరైన మధ్య వయస్కుడిగా ఆయనను నిలబెట్టింది. ఈ అంశం వారసత్వ రేసులో ఆయనకు ముఖ్యమైన బలాన్ని అందిస్తుంది. కంపెనీలోని ఇతర ఉన్నతాధికారుల నుంచి, ముఖ్యంగా టిమ్ కుక్ నుంచి కూడా టర్నస్‌కు మంచి పేరు, మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. టర్నస్ బలంగా ఉన్నప్పటికీ, యాపిల్‌లో అత్యంత సీనియర్‌గా ఉన్న మరికొంతమంది పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. అయితే వారసత్వ జాబితాలో వారు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఒకవేళ ఊహించని అత్యవసర పరిస్థితులు తలెత్తితే, యాపిల్ సీవోవో గా ఉన్న సబిహ్ ఖాన్ (Sabih Khan) లేదా రిటైల్ హెడ్ డీర్డ్రే ఓబ్రియిన్ (Deirdre O’Brien) తాత్కాలికంగా సీఈవో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే, సంస్థాగత ప్రణాళికలో భాగంగా ముందుకెళితే, టర్నస్కే పూర్తి స్థాయి సీఈవో బాధ్యతలు దక్కే అవకాశాలు మెండని టెక్ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com