ఆలస్యం ఖరీదు రూ.7.42 లక్షల కోట్లు..

ఆలస్యం ఖరీదు రూ.7.42 లక్షల కోట్లు..
కరోనా ప్రభావం కారణంగా అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యం అయింది.

ఆపిల్ ఐఫోన్.. మార్కెట్లో ఆ ఫోన్‌కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే.. కొత్తగా ఈ ఫోన్‌కి సంబంధించి ఏ వెర్షన్ వచ్చినా కొనుగోలు దారులు ఎప్పుడెప్పుడు కొందామా అని ఎదురుచూస్తుంటారు. అనుకున్న సమయానికి మార్కెట్లోకి ఫోన్ తీసుకురాకపోతే ఆ ప్రభావం యాపిల్ మార్కెట్‌పై తీవ్రంగా కనబడుతుంది. తాజాగా ఐఫోన్ 12.. కరోనా ప్రభావం కారణంగా అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యం అయింది. దాంతో నేడు మార్కెట్లో ఆ కంపెనీ షేర్ల విలువ ఫ్యూచర్స్ మార్కెట్‌లో దాదాపు 5 శాతం పతనమైంది. మన కరెన్సీ ప్రకారం రూ.7.42 లక్షల కోట్ల పై చిలుకు మాట.

2013 నుంచి ప్రతి ఏటా సెప్టెంబరులో యాపిల్ సంస్థ సరికొత్త మోడల్ ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈసారి కూడా 5జీ ఐఫోన్‌ను సెప్టెంబర్‌లో మార్కెట్లోకి తెస్తుందని వినియోగదారులు భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం చోటు చేసుకుంది. దీంతో అక్టోబర్‌లో మార్కెట్లో విడుదల చేసింది. దాని ఫలితం సెప్టెంబర్ త్రైమాసిక విక్రయాలపై పడింది. కొత్త ఫోన్ కోసం ఎదురు చూసి ఇంకా రావట్లేదని నిరాశ చెందారు, ఫోన్ కొనుగోళ్లను వాయిదా వేశారు. దీంతో విక్రయాలు 20.7 శాతం తగ్గాయి. కానీ యాపిల్‌కు చెందిన మాక్, ఎయిర్ పాడ్‌ల విక్రయాలు పెరగడంతో లాభాల్లో వృద్ధి కనిపించింది. గురువారం ఆ సంస్థ ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో 64.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని చూపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది ఒక శాతం ఎక్కువ. విశ్లేషకుల అంచనాలను మించి ఒక్కో షేరుకు 0.73 డాలర్ల ఆదాయం వచ్చింది. అయినా కానీ, అనుకున్న సమయానికి కొత్త ఐఫోన్ మార్కెట్లోకి రాకపోవడంతో ఆ విభాగంలో విక్రయాలు తగ్గడంతో వాటాదారులు నిరాశ చెందారు. ఇక చైనా మార్కెట్లో అయితే ఈ సీజన్‌లో అమ్మకాలు 29 శాతం తగ్గాయి. దీనిపై కంపెనీ సీఈవో టిమ్ కుక్ మాట్లాడుతూ కొత్త ఐఫోన్ 12, ప్రో, మార్కెట్లోకి వచ్చాక పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో అమ్మకాల పట్ల ఆశాజనకంగా ఉంది సంస్థ.

Tags

Next Story