bajaj: బజాజ్ చేతక్ నుంచి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్

bajaj:  బజాజ్ చేతక్ నుంచి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్
X
రూ. 1.10 లక్షలకే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ బజాజ్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. 35 సిరీస్‌లో 3503 పేరిట కొత్త చేతక్‌ను తాజాగా లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.1.10 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది. చేతక్‌ 35 సిరీస్‌లో అందుబాటు ధరలో తీసుకొచ్చిన మోడల్‌ ఇదే కావడం గమనార్హం. బజాజ్‌ సంస్థ చేతక్‌ 35 సిరీస్‌లో కొన్ని నెలల క్రితం 3501 (టాప్‌ మోడల్‌) ధరను రూ.1.30 లక్షలుగా నిర్ణయించింది. చేతక్‌ 3502 మోడల్‌ ధరను రూ.1.22 లక్షలుగా పేర్కొంది. అప్పట్లో 3501ను కూడా తీసుకొస్తామని ప్రకటించింది. తాజాగా అందుబాటు ధరలో దీన్ని తీసుకొచ్చింది. ఇది టీవీఎస్‌ ఐక్యూబ్‌ 3.4, ఓలా ఎస్‌1ఎక్స్‌+, ఏథర్‌ రిజ్తా ఎస్‌ వంటి మోడళ్లకు పోటీగా నిలనుంది.

తక్కువ ధరకే 155 కిలోమీటర్ల పరుగులు

దేశంలోని అన్ని అధికారిక డీలర్‌షిప్‌లలో ఈ బజాజ్ చేతక్ 3503 వాహనం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇందులో 35 సిరీస్ బ్యాటరీ ప్యాక్, అప్‌డేట్ చేసిన సర్కిల్, తదితర ఫీచర్లు ఉన్నాయి. 35 సిరీస్ వేరియంట్ల మాదిరిగానే ఇది ప్రాథమిక ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది. ఇందులో 3.5 kWh బ్యాటరీ అమర్చడం వల్ల ఇది ఏకంగా 155 కి.మీల రేంజ్‌ వరకు పరుగులు పెడుతుంది. ఇది తక్కువ ధరకే 155 కిలోమీటర్ల వరకు పరుగులు పెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే, 35 సిరీస్‌లోని ఇతర ట్రిమ్‌లతో పోలిస్తే ఎంట్రీ లెవల్ ట్రిమ్ గంటకు 63 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందుకోగలదు.

సౌకర్యవంతమైన ఫీచర్లు

టాప్ కాంపోనెంట్‌ల విషయానికొస్తే బజాజ్ చేతక్ 3503లో బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన కలర్ LCD ఉంది. ఇది వినియోగదారులకు అన్ని కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. హిల్ హోల్డ్ హెల్ప్, రెండు రైడింగ్ మోడ్‌లు, ఇతర సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే, ధర తగ్గించినందుకు గాను సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు వంటి కొన్ని ఫీచర్‌లను తొలగించారు. దీనికి ఛార్జింగ్ సమయం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. 0-80% ఛార్జింగ్ ఎక్కాలంటే 3 గంటల 25 నిమిషాలు పడుతుంది.

Tags

Next Story