నేటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

నేటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు
వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులు సూచించాయి.

దేశవ్యాప్తంగా నేటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోయాయి. రెండు రోజులు సెలవు దినాలు కాగా.. మిగిలిన రెండు రోజులూ సమ్మె కారణంగా ఖాతాదారులకు సేవలు దూరం కానున్నాయి. ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం కావడంతో ఈ రెండు రోజులూ బ్యాంకులు పనిచేయవు. ఇక 15, 16 తేదీల్లో సమ్మె కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, ఏటీఎం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు మాత్రం యథాతథంగా పనిచేయనున్నాయి.

రెండు ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ఒక ప్రభుత్వరంగ బీమా సంస్థను ప్రైవేటీకరించనున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా ఇటీవల కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని బ్యాంక్‌ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ది యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ సమ్మెకు పిలుపునిచ్చింది. 10 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా. సమ్మె కారణంగా ఎస్‌బీఐ, కెనరా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు 15,16 తేదీల్లో మూతపడనున్నాయి.

ఇక ఈనెలలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోనున్నాయి. పండుగ సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు, రెండో శనివారం, 4 ఆదివారాలతో కలిసి మొత్తం ఈ నెలలో 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులు సూచించాయి.

Tags

Read MoreRead Less
Next Story