బ్యాంకు లాకర్‌లో నగదు భద్రమేనా.. అసలు లాకర్ ఎలా తీసుకోవాలి..

బ్యాంకు లాకర్‌లో డబ్బు, బంగారం సురక్షితంగా ఉంటుందా.. అసలు లాకర్ ఎలా ఓపెన్ చేయాలి. ఎవరు పడితే వారు లాకర్ ఓపెన్ చేయొచ్చా.. ఇలా ఎన్నో విషయాలు లాకర్ గురించిన సందేహాలు.. వాటన్నింటినీ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం..
లాకర్ ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే ఆ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉండాలి. లాకర్ తీసుకున్న వారు ఏడాదికి ఒకసారి దానికి సంబంధించి బ్యాంకు వారికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్లు.. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్/ఫారం 60, కేవైసీ పత్రాలు బ్యాంకు వారికి అందజేయాలి.
సందరు బ్యాంకులో లాకర్ తీసుకునేందుకు ఒప్పంద పత్రం మీద సంతకం చేయాల్సి ఉంటుంది. లాకర్ కావాలనుకున్న వ్యక్తి నుంచి బ్యాంకులు డిపాజిట్ రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేస్తాయి. ఇది బ్యాంకులను బట్టి మారుతుంటుంది.
ఇక లాకర్‌లో పెట్టిన వస్తువులకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. లాకర్ బ్యాంకు వారి స్వాధీనంలో ఉన్నా లాకర్‌లో వస్తువులపై బ్యాంకు వారికి ఎలాంటి సంబంధం ఉండదు.
లాకర్‌కు చెందిన తాళం చెవులు ఒకటి ఖాతాదారుడి వద్ద ఉంటే, మరొకటి బ్యాంకు వారి వద్ద ఉంటుంది. లాకర్ తెరవాలంటే వాళ్లది, మీది రెండూ ఉపయోగించాలి. కానీ మూసేందుకు మీ ఒక్క తాళం చెవి సరిపోతుంది. అందుకే మీ లాకర్ తాళం చెవిని భద్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ లాకర్ కీని పోగొట్టుకుంటే వెంటనే బ్యాంకు వారికి తెలియజేయాలి.
వాళ్లు లాకర్ బద్దలు కొట్టి తెరుస్తారు. అందుకు అయ్యే ఖర్చును మీనుంచే వసూలు చేస్తారు.
లాకర్ ఖాతాదారుడు మాత్రమే తెరవాలా అంటే అవుననే చెప్పాలి. లాకర్‌ని స్నేహితులు, కుటుంబసభ్యులు ఎవరూ తెరవడానికి వీలు లేదు.
బ్యాంకు లాకర్‌కి కూడా ఖాతాదారుడు నామినీని నియమించవచ్చు. అయితే కేవలం ఒక నామినీని మాత్రమే నియమించాల్సి ఉంటుంది.
ఒకవేళ బ్యాంకులో దొంగతనం జరిగి లాకర్‌లో ఉన్న నగదు చోరీకి గురైతే బ్యాంకులు బాధ్యత వహిస్తాయా అని అంటే లాకర్‌లోని వస్తువులు పోతే బ్యాంకులకు ఎలాంటి సంబంధం ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఖాతాదారులు వారి సొంత రిస్క్‌తో లాకర్‌లో తమ విలువైన వస్తువులను దాచుకుంటారు. బ్యాంకులు కేవలం లాకర్ సర్వీసులను మాత్రమే అందిస్తుంది. కానీ వాటికి బాధ్యత వహించవు.
లాకర్ హోల్డర్ సంవత్సరానికి 12 సార్లు మాత్రమే ఉచితంగా లాకర్‌ని వినియోగించే అవకాశం ఉంటుంది. దానికంటే ఎక్కువసార్లు నిర్వహించాలనుకుంటే మాత్రం బ్యాంకుకు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
లాకర్ ఎప్పుడు బద్దలు కొట్టే అవకాశం ఉంది..
నామినీ పేరును నమోదు చేయకుండా లాకర్ యజమాని మరణించినప్పుడు, లాకర్ తాళం చెవిని పోగొట్టుకున్నప్పుడు, నిర్ధిష్ట సమయం కంటే ఎక్కువ సమయం లాకర్‌ను నిర్వహించలేకపోయినప్పుడు మాత్రమే లాకర్‌ని బద్దలు కొట్టే అవకాశం ఉంటుంది.
అలాంటి సమయాల్లో నామినీ, బ్యాంకుకు చెందిన లాయర్, బ్యాంకుతో ఎక్కువ కాలం సంబంధం ఉన్న ఖాతాదారుడి సమక్షంలో లాకర్‌ని తెరుస్తారు. బ్యాంకు లాకర్లను ఏ సంస్థ అయితే తయారు చేస్తుందో వారి ద్వారా మాత్రమే బ్యాంకులు లాకర్లను తెరుస్తాయి.
లాకర్ యజమాని అనుమతి లేకుండా బ్యాంకులు లాకర్ తెరవచ్చా..
కేవలం కొన్ని సందర్భాల్లో బ్యాంకులు అలా చేస్తాయి. కోర్టు ఆదేశాల మేరకు ఖాతాదారుడి ప్రమేయం లేకుండా లాకర్‌ని తెరుస్తాయి. అలాగే సమయానికి లాకర్ అద్దె చెల్లించకపోయినా, కొన్ని సార్లు అద్దె చెల్లించినప్పటికీ, ఏడాది కాలం పాటు ఖాతాదారుడు లాకర్ తెరవకపోయినా బ్యాంకులు లాకర్‌ని తెరిచే వీలుంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com