బ్యాంక్ లోన్ ఉన్న ప్రతి ఒక్కళ్లూ తెలుసుకోవాల్సిన విషయం..

టెలిఫోన్ బిల్స్, మొబైల్ బిల్స్ ప్రీ పెయిడ్ కానీ, పోస్ట్‌పెయిడ్ కానీ నెలవారీ బిల్లులు చెల్లించాల్సిన సమయం దగ్గర పడేకొద్దీ మనకి ఫోన్ కాల్స్ లేదంటే ఎస్ఎంఎస్‌లు వస్తుంటాయ్. కొన్ని కాల్స్ అయితే మరీ భరించలేం కూడా, ఒక్కోసారి బిల్ పే చేసిన తర్వాత కూడా ఎస్ఎంఎస్‌లు వస్తూనే ఉంటాయ్. సరిగ్గా అలాగే, ఇప్పుడు బ్యాంకులు కూడా తమకి కట్టాల్సిన పేమెంట్ల కోసం కస్టమర్ల ఫోన్లకి మెసేజ్‌లు, ఫోన్లు, పంపబోతున్నాయ్.
జులై 1 నుంచి బ్యాంకులు కూడా టెలికాం కంపెనీల్లానే తమ స్ట్రాటజీ మార్చుకోబోతున్నాయ్. సాధారణంగా బ్యాంకులకు మనం కట్టాల్సిన ఈఎంఐల విషయంలో నెలలో ఓసారి అది కూడా డ్యూ డేట్ ముందు ఒకసారి బిల్ జనరేట్ అయిన తర్వాత ఒకసారి ఎస్ఎంఎస్‌లు పంపిస్తాయ్. కానీ కొత్త పద్దతిలో మాత్రం నెలలో ఎన్నిసార్లైనా తమ పేమెంట్లు కోసం షార్ట్ మెసేజ్ సర్వీస్ కానీ, ఫోన్ ద్వారా కానీ అలర్ట్ చేయబోతున్నాయ్.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం నాన్ పెర్ఫామింగ్ అసెట్స్-మొండిబకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకే బ్యాంకులు ఈ కొత్త విధానంపై దృష్టి సారించాయని తెలుస్తోంది. అలానే రోజువారీ పద్దతిలో కూడా లోన్లను ఎన్‌పిఏలుగా ప్రకటించే విధానం రాబోతుంది. ఇప్పటిదాకా నెలల పద్దతిలోనే బకాయి పడిన ఖాతాలను ఎన్‌పిఏలుగా ప్రకటిస్తున్నారు. ఒక్క రోజు మిస్సైనా ఎన్‌పిఏ కిందనే లెక్కగట్టే ప్రమాదం కూడా ఈ పద్దతిలో ఉంది.
సెప్టెంబర్ 14,2020 ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం, అన్ని రకాల అప్పులు తీసుకున్న అక్కౌంట్లకి ఈ పద్దతి వర్తింపజేయాలి. సిస్టమ్ బేస్డ్ అసెట్ క్లాసిఫికేషన్ ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది ఆర్బీఐ. దీంతో ప్రతి రోజూ అక్కౌంట్లను ఎన్‌పిఏ, నాన్-ఎన్‌పిఏ ఖాతాలను వర్గీకరించే బాధ్యత బ్యాంకులపై పడింది. ఇది ఓ రకంగా శ్రమతో కూడిన పనే.
సింపుల్‌గా చెప్పాలంటే మీరు బ్యాంక్‌కి కట్టాల్సిన బకాయి కట్టకపోతే, అది ఎన్‌పిఏగా ప్రకటించాలంటే, గడువు తేదీ ముగిసినా సరే, ఆ నెల మొత్తం పూర్తై, కొత్తనెల ప్రారంభం అయితేకానీ గతంలో కుదిరేది కాదు. కానీ కొత్త రూల్ ప్రకారం గడువు తేదీ ముగిసిన వెంటనే తర్వాతి రోజే ఎన్‌పిఏగా ప్రకటిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com