రూ.43 వేల కోట్ల నౌకపై బెజోస్ వివాహ వేడుకలు!

ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రేమ జీవితాన్ని మరో మెట్టుకు తీసుకెళ్తున్నారు. ఆయన తన కాబోయే భార్య లారెన్ శాంచెజ్‌తో ఇటలీలోని చారిత్రాత్మక వెనిస్ నగరంలో వివాహం చేసుకోనున్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ మ్యారేజ్ సెలెబ్రేషన్స్ జూన్ 24-26 తేదీలలో నిర్వహించనున్నారు. కాగా, ఈ వేడుకపై స్ధానికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విలాసవంతమైన యాచ్‌నే పెళ్లి వేదిక
వెనిస్ సరస్సులో లంగరు వేయనున్న రూ.43 వేల కోట్ల విలువైన సూపర్ యాచ్ "కొరు"పై అసలు పెళ్లి వేడుక జరుగనుంది. దీనికి తోడు "అబియోనా" అనే మరో సహాయక నౌక కూడా ఉపయోగించనున్నారు. ఇతర కార్యక్రమాలు వెనిస్లోని చారిత్రక భవనాలైన పాలాజ్జో పిసాని మోరెట్టా, స్కూలా గ్రాండే డెల్లా మిసెరికోర్డియా, మరియు లిడోలోని హోటల్ ఎక్సెల్సియర్లో జరుగుతాయి.
గెస్ట్ లిస్ట్‌లో హాలీవుడ్ – టెక్ దిగ్గజాలు
పెళ్లికి ఒర్లాండో బ్లూమ్, కేటీ పెర్రీ, మిక్ జాగర్, కిమ్ కర్దాషియన్, ఓప్రా విన్ఫ్రే, లియోనార్డో డికాప్రియో, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, డొనాల్డ్ ట్రంప్, ఇవాంకా ట్రంప్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం 200 మంది ప్రముఖులు వేడుకల్లో పాల్గొననున్నారు.
ఖర్చు రూ.132 కోట్లు!
ఈ రాజకీయ స్థాయి వేడుకకు అంచనా ఖర్చు 16 మిలియన్ డాలర్లు (సుమారు ₹132 కోట్లు). పూల అలంకరణ, వేదిక అద్దెలు, క్యాటరింగ్, ప్లానింగ్, డిజైనర్ దుస్తులు – ప్రతి అంశంలోనూ విలాసం తలకెక్కుతోంది. విశేషంగా, ఈ వేడుకలో లేడీ గాగా ప్రదర్శన ఇవ్వనున్నారు అన్న ఊహాగానాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com