CANARA BANK: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన కెనరా బ్యాంక్ తమ ఖాతాదారులకు పెద్ద ఊరటను ప్రకటించింది. అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లపై కనీస నెలవారీ బ్యాలెన్స్ అవసరాన్ని పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు శనివారం (మే 31) ప్రకటించింది. ఈ నిర్ణయం జూన్ 1, 2025 నుంచి తక్షణమే అమలులోకి వచ్చింది.
ఇకపై ఖాతాలో కనీస మంత్లీ బ్యాలెన్స్ అవసరం లేదు
కెనరా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారులు ఇకపై ఖాతాలో నిర్దిష్ట మొత్తాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు. కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోయినా, ఎలాంటి జరిమానా (Penalty) విధించబడదు. ఇది కెనరా బ్యాంక్‌ను మినిమం బ్యాలెన్స్‌ను పూర్తిగా తొలిగించిన తొలి ప్రభుత్వరంగ బ్యాంకుగా నిలిపింది.
ఈ కొత్త విధానం వర్తించే ఖాతాలు:
రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లు, NRI సేవింగ్స్ అకౌంట్లు
విద్యార్థులు, వృద్ధులు, మరియు మొదటిసారి బ్యాంకింగ్ ప్రారంభిస్తున్న ఖాతాదారుల ఖాతాలు
కస్టమర్లకు మరింత అనుకూలమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడంతో పాటు, ఆర్థిక చేర్పును ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు తెలిపింది. గతంలో, ఖాతాదారులు బ్యాంకు నిర్దేశించిన కనీస నెలవారీ బ్యాలెన్స్ ఉంచకపోతే జరిమానాలు చెల్లించాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఆందోళన అవసరం ఉండదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం లక్షల మంది సాధారణ ఖాతాదారులకు, వృద్ధులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, అలాగే ఎన్ఆర్ఐ ఖాతాదారులకు ప్రయోజనకరంగా మారనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com