EPFO: కంపెనీ మార్చారా? PFలో ఎగ్జిట్ డేట్ తప్పనిసరి

ఉద్యోగస్తులకు ప్రావిడెంట్ ఫండ్ (PF) అనేది కేవలం పొదుపు మాత్రమే కాదు, రిటైర్మెంట్ తర్వాత లభించే ప్రధాన ఆర్థిక భరోసా. అయితే, చాలామంది ఉద్యోగులు ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మారే సమయంలో పీఎఫ్ బదిలీపై ఉన్న శ్రద్ధ, వివరాల అప్‌డేషన్‌పై చూపరు. ముఖ్యంగా పాత కంపెనీలో ఉద్యోగం వదిలేసిన తేదీ (Date of Exit) నమోదు చేయకపోవడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా హెచ్చరించింది.
ఎగ్జిట్ డేట్ ఎందుకు ముఖ్యం?
మీ పీఎఫ్ ఖాతాలో మీరు చేరిన తేదీ మరియు మానేసిన తేదీ (Date of Exit) అత్యంత కీలకం. ఈ వివరాల ఆధారంగానే మీరు ఎన్ని ఏళ్లు సర్వీస్ చేశారనేది లెక్కించబడుతుంది.
పెన్షన్ అర్హత: పది ఏళ్ల నిరంతర సర్వీస్ ఉంటేనే పెన్షన్‌కు అర్హత లభిస్తుంది. ఎగ్జిట్ డేట్ సరిగ్గా లేకపోతే సర్వీస్ గ్యాప్ కింద పరిగణించబడి పెన్షన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది.
క్లెయిమ్స్ తిరస్కరణ: పాత కంపెనీ వివరాలు క్లోజ్ అవ్వకుండా, కొత్త కంపెనీ నుండి పీఎఫ్ విత్ డ్రా చేయడం లేదా ట్రాన్స్‌ఫర్ చేయడం సాధ్యపడదు. డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేకపోతే సిస్టమ్ మీ క్లెయిమ్‌ను రిజెక్ట్ చేస్తుంది.
వడ్డీ లెక్కలు: సర్వీస్ పీరియడ్‌ను బట్టి మీ నిధులకు వచ్చే వడ్డీ రేట్లు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఆధారపడి ఉంటాయి.
ఆన్‌లైన్‌లో 'డేట్ ఆఫ్ ఎగ్జిట్' మార్చుకోవడం ఎలా?
గతంలో ఎగ్జిట్ డేట్ నమోదు చేయాలంటే కంపెనీ యజమాని చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పీఎఫ్ చందాదారులు స్వయంగా UAN పోర్టల్ ద్వారా ఈ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.
ముందుగా EPFO మెంబర్ పోర్టల్‌లోకి వెళ్లి మీ UAN మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
మెనూ బార్‌లోని 'Manage' ఆప్షన్‌పై క్లిక్ చేసి, 'Mark Exit' ఎంచుకోండి.
డ్రాప్ డౌన్ మెనూ నుండి మీరు ఏ కంపెనీ వివరాలు మార్చాలనుకుంటున్నారో ఆ 'Select Employment' ఆప్షన్ ఎంచుకోండి.
అక్కడ మీ చివరి పని దినాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. (గుర్తుంచుకోండి: కంపెనీ నుండి బయటకు వచ్చిన రెండు నెలల తర్వాతే ఈ వివరాలు అప్‌డేట్ చేయడానికి వీలవుతుంది). మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ మీరు పనిచేసిన పాత సంస్థ మూతపడినా లేదా యజమాని మీ వివరాలను అప్‌డేట్ చేయడంలో సహకరించకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అటువంటి సందర్భాల్లో మీరు 'Joint Declaration Form' ను పూర్తి చేసి, అవసరమైన గుర్తింపు పత్రాలతో మీ పరిధిలోని ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించాలి. పీఎఫ్ కాంట్రిబ్యూషన్ హిస్టరీని పరిశీలించి అధికారులు మీ వివరాలను అప్‌డేట్ చేస్తారు.
కొత్త కంపెనీలో చేరగానే పాత పీఎఫ్ బ్యాలెన్స్‌ను కొత్త ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల సర్వీస్ కంటిన్యుటీ దెబ్బతినదు. అలాగే, ప్రతి నెలా మీ మొబైల్‌కు వచ్చే పీఎఫ్ మెసేజ్‌లను గమనిస్తూ ఉండాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
