Oil Price : వంటనూనె ప్యాకెట్‌ రూ.200 ?

Oil Price : వంటనూనె ప్యాకెట్‌ రూ.200 ?
Oil Price : బంగారం ధర 60వేల రూపాయలను టచ్ చేస్తుందా? పెట్రోల్‌ రేటు 150 రూపాయలకు చేరుతుందా? వంటనూనె ప్యాకెట్‌ 200 రూపాయలు దాటుతుందా?

Oil Price : బంగారం ధర 60వేల రూపాయలను టచ్ చేస్తుందా? పెట్రోల్‌ రేటు 150 రూపాయలకు చేరుతుందా? వంటనూనె ప్యాకెట్‌ 200 రూపాయలు దాటుతుందా? పది గ్రాముల బంగారం ధర మహా అయితే 56వేల రూపాయల వరకు వెళ్లొచ్చని భావించారు. పెట్రోల్, డీజిల్ ధర పెరిగితే ఇక్కడి నుంచి ఓ 10, 15 రూపాయలు పెరగడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. మంచినూనె ప్యాకెట్‌ మునిపటిలా 170, 180 రూపాయలకు చేరొచ్చు అనుకున్నారు. కాని పరిస్థితులు చేయి దాటిపోయేలా కనిపిస్తున్నాయి. బంగారం, పెట్రోల్, డీజిల్, వంటనూనె, కాపర్, స్టీల్, పల్లాడియం, అల్యూనిమియం.. ఇలా ఒకటేమిటి నిత్యావసరాల్లో భాగంగా ఉన్న ప్రతి ఒక్క వస్తువూ సామాన్యుడి నడ్డివిరిచేందుకు సిద్ధంగా ఉంది.

బంగారం విషయానికొస్తే.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా జస్ట్ ఈ 12 రోజుల్లోనే పది గ్రాముల పసిడి 6వేల రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 2వేల డాలర్లను టచ్ చేసింది. 2020 ఆగస్ట్‌ తరువాత బంగారం ధర ఈ స్థాయిని తాకడం ఇదే మొదటిసారి. అంటే కరోనా కల్లోల సమయంలో బంగారం చరిత్ర ఎరుగని ధర పలికింది. ఇప్పుడు మళ్లీ అవే పరిస్థితులు వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతున్నా సరే.. ఔన్స్‌ బంగారం 2వేల డాలర్లు దాటకపోవచ్చని కొందరు అంచనా వేశారు. కాని, ఆ అంచనాలు తలకిందులవుతున్నాయి. ఔన్స్‌ బంగారం 2వేల డాలర్లు టచ్ చేసింది. యుద్ధం ఇంకా తీవ్రతరం అయితే బంగారం ధర ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతుందని చెబుతున్నారు.

వంటనూనె ధరలు కూడా నింగినంటడం ఖాయంగా కనిపిస్తోంది. యుద్ధం మొదలైన తరువాత మంచినూనె ధరలు 20 రూపాయల వరకు పెరిగాయి. ఇది ఇక్కడితో ఆగదని, దాదాపు ప్యాకెట్‌ ధర 200 రూపాయలు దాటవచ్చనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లో 70 శాతం ఉక్రెయిన్‌ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. 20 శాతం వరకు రష్యా నుంచి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ వస్తోంది. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కోసం మరో దేశాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. భారత అవసరాలు తీర్చేంత సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను ఉత్పత్తి దేశాలు చాలా తక్కువే. దీంతో వచ్చే కొద్దిరోజుల్లోనే వంటింటి నూనె ధర 200 రూపాయలు దాటొచ్చని చెబుతున్నారు. ధరలు పెరుగుతున్నాయని చెప్పి ధర పెంచి అమ్మడం మొదలుపెట్టారు వ్యాపారులు.

ఇక పెట్రోల్, డీజిల్ ధర 12 రూపాయల వరకు పెంచవచ్చని వార్తలు వచ్చాయి. ఈ అంచనాలు వచ్చే సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ క్రూడాయిల్ ధర 100 డాలర్ల వద్ద కదలాడింది. కాని, రాత్రికి రాత్రే క్రూడాయిల్‌ ధర 130 డాలర్లను టచ్‌ చేసింది. ఇది ఇక్కడితో ఆగేది కాదు. రష్యా నుంచి క్రూడాయిల్, గ్యాస్‌ను కొనకూడదని అమెరికా, దాని మిత్రదేశాలు భావిస్తున్నాయి. రష్యా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌పై నిషేధం విధిస్తే పరిస్థితి చేయి దాటడం ఖాయం. ఒకప్పుడు బ్యారెల్ క్రూడాయిల్‌ 150 డాలర్లు దాటిందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ స్థాయిని మించి పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు స్థిరంగా ఉన్నా సరే.. భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ ధరలు పెంచి మోత మోగించారు. ఈ లెక్కన చూస్తే దేశంలో లీటర్‌ పెట్రోల్‌ ధర ఈజీగా 150 రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story