సామాన్యులపై వంటనూనె, నిత్యావసర ధరల పిడుగు!

కరోనా నేపథ్యంలో ఆదాయాలు పడిపోయి జనం అల్లాడుతుంటే నిత్యావసరాల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధానంగా వంటనూనె ధర సలసల కాగిపోతున్నాయి. వారం, పది రోజుల్లోనే ధరలు అమాంతం పెరిగిపోవడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. వంట నూనెలు కూడా సుమారు 30 శాతం పెరిగాయి.
పండుగల సీజన్ కావటంతో పిండివంటలు చేసుకోవాలని షాపులకు వెళ్ళిన వారికి పెరిగిన ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. ఆరు నెలల క్రితం పామాయిల్ ధర రూ.75 ఉంది. ఇప్పుడది దాదాపు 120కు పెరిగింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ.102 నుంచి రూ.135కు పెరిగింది. ఇక వేరు శనగ నూనె అయితే ఏకంగా రూ.150లకు చేరింది.
ఆయిల్ ప్యాకెట్లపై ఎంఆర్‌పీ ఎక్కువగానే ఉంటున్నాయి. దీనిని చూపిస్తోన్న వ్యాపారులు తాము తక్కువకే విక్రయిస్తున్నామని వినియోగదారులకు చెబుతున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు కనీసం ఐదు లీటర్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ అవసరమవుతోంది. కానీ ఇందులో సగం మాత్రమే వాడుతున్నారు. ఇక సిలిండర్‌పై రెండు సార్లుగా రూ.100లు అదనంగా పెరిగింది.
నూనెలు, వంట గ్యాస్ ధరల పెరుగుదల ప్రభావం హోటళ్లపై కూడా పడుతుంది. హోటల్స్, బేకరీలు, స్వీటు షాపుల్లో విక్రయించే తినుబండారాల ధరలనూ ప్రభావితం చేస్తున్నాయి. వీటికి తోడు పెట్రో ధరలు సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాహనాలను నడపాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com