POST OFFICE: ఇక పోస్టాఫీస్ మీ జేబుల్లోనే..

భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) తమ సేవలను ప్రజలకు మరింత వేగంగా, సౌకర్యవంతంగా చేరువ చేసే దిశగా విప్లవాత్మకమైన ముందడుగు వేసింది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, పోస్టాఫీస్ సేవలను స్మార్ట్‌ఫోన్ ద్వారానే అందించేందుకు వీలుగా 'డాక్ సేవ (Dak Sewa App)' పేరుతో సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. "ఇక పోస్టాఫీస్ మీ జేబులోనే" అంటూ తపాలా శాఖ తమ అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ మొబైల్ యాప్ ద్వారా తపాలా శాఖ అందించే దాదాపు అన్ని ముఖ్యమైన యుటిలిటీ సేవలను ఎక్కడి నుంచైనా వినియోగించుకోవచ్చు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన శ్రమను తప్పిస్తూ, డిజిటల్ యుగంలోకి ఇండియా పోస్ట్ అడుగుపెడుతున్నట్లు ఈ యాప్ స్పష్టం చేస్తోంది.
డాక్ సేవ యాప్ ప్రధాన ఫీచర్లు:
పోస్టల్ ట్రాకింగ్ (Real-Time Tracking): స్పీడ్‌పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, పార్సిల్ మరియు మనీ ఆర్డర్ వివరాలను రియల్‌టైమ్‌లో (క్షణం-క్షణం) సులభంగా ట్రాక్ చేసుకునే సౌకర్యం. మీ వస్తువు ఎక్కడ ఉందో వెంటనే తెలుసుకోవచ్చు. పోస్టేజ్ కాలిక్యులేషన్ (Charges Calculation): దేశీయంగా, అంతర్జాతీయంగా పంపే లేఖలు, పార్సిల్స్ మరియు ఇతర వస్తువుల బరువు ఆధారంగా వాటికి అయ్యే ఛార్జీలను తక్షణమే లెక్కించవచ్చు. బుకింగ్ సేవలు: స్పీడ్‌పోస్ట్, రిజిస్టర్డ్ పోస్టు, పార్సిల్ వంటి సేవలను యాప్ ద్వారానే పూర్తిచేసుకోవచ్చు. బుకింగ్ కోసం ఇక పోస్టాఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇతర యుటిలిటీలు: ఇన్సూరెన్స్ (PLI/RPLI) ప్రీమియం చెల్లింపులు, ఫిర్యాదుల నమోదు , వాటి స్టేటస్ ట్రాకింగ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. సమీప పోస్టాఫీస్ శోధన: జీపీఎస్ (GPS) సాయంతో వినియోగదారుడికి దగ్గరలో ఉన్న పోస్టాఫీసుల వివరాలు, చిరునామా మరియు కాంటాక్ట్ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. కార్పొరేట్ కస్టమర్ల కోసం ప్రత్యేక విభాగం కూడా ఈ యాప్‌లో ఉంది. బహుళ భాషల మద్దతు: వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి ఈ యాప్ మొత్తం 23 భాషలలో అందుబాటులో ఉంది. డార్క్ మోడ్ ఫీచర్ కూడా ఇందులో పొందుపరిచారు.
యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే విధానం:
డాక్ సేవ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం సులభం. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ నుంచి "Dak Sewa App" అని టైప్ చేసి, 'డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా' పేరుతో ఉన్న అధికారిక యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్ చేసి, మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ అయి, ఓటీపీ (OTP) ద్వారా లాగిన్ అయ్యి సేవలను వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలు, యూజర్ సపోర్ట్ లేదా పాలసీ అప్డేట్ల కోసం వినియోగదారులు తపాలా శాఖ అధికారిక వెబ్సైట్ [www.indiapost.gov.in](http://www.indiapost.gov.in) ను సందర్శించవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

