Demand for properties: పెరిగిన ఇళ్ల కొనుగోళ్లు.. రూ.50లక్షల లోపు ఇళ్లకు డిమాండ్

Demand for properties: మహమ్మారి సమయంలో మందకొడిగా సాగిన రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ ఊపందుకుంది. గ్రేటర్ హైదరాబాద్ లో స్థిరాస్థి రంగం వేగం పుంజుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు నగరంలో రూ.15,071 కోట్లు విలువ చేసే 31,126 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 152 శాతం ఎక్కువ. మార్చి నెలకంటే ఏప్రిల్ నెలలో మరిన్ని ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని నివేదికలు తెలుపుతున్నాయి.
గత నెలలో 55 శాతం గృహాలు రూ.25-50 లక్షల లోపు ధర ఉన్నఇళ్లు అమ్ముడుపోయాయి. రూ.25 లక్షల లోపు ధర ఉన్న గృహాలకు డిమాండ్ క్రమంగా తగ్గుతుంది. రూ.కోటి పైన ఉన్న ప్రాపర్టీల కొనుగోళ్లు కూడా 6 శాతానికి క్షీణించాయి.
సంవత్సరాలుగా ధరలలో గణనీయమైన పెరుగుదల ఉంది. అదే సమయంలో ఆదాయాలు కూడా పెరిగాయి. దీంతో ఇళ్లను కొనుగోలు చేసేవారు పెరిగారు. రూ. 25 లక్షల నుండి రూ. 50 లక్షల ధరల శ్రేణిలో ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 2BHKని రూ.75 నుండి రూ.80 లక్షలకు విక్రయాలు జరుగుతున్నాయి.
అమ్మకాలు పెరగడానికి కారణం జీతాల పెంపు. ''గత ఇరవై ఏళ్లలో ఐటీ రంగం మునుపెన్నడూ లేనివిధంగా జీతాల పెంపుదల చూడటం ఇదే తొలిసారి. 'టాలెంట్ వార్' ద్వారా ప్రతిభను నిలుపుకోవడానికి కంపెనీలు పోటీపడుతున్నాయి. దీంతో దాదాపు 50 శాతం నుంచి 300 శాతం వరకు జీతాలు పెరిగాయి. ఆ మొత్తాన్ని వారు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతున్నారు, అని రియల్ నిపుణులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com