ICICI: హెచ్‌డీఎఫ్‌సీని ఐసీఐసీఐ కొనాలనుకున్నదా?

ICICI: హెచ్‌డీఎఫ్‌సీని ఐసీఐసీఐ కొనాలనుకున్నదా?
X
హెచ్‌డీఎఫ్‌సీ‌ను ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ కొనుగోలు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనమైన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC)ను ఓ దశలో ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank) కొనుగోలు చేయాలనుకుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆసక్తికర నిజాన్ని హెచ్‌డీఎఫ్‌సీ మాజీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ స్వయంగా వెల్లడించారు. ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చర్‌ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరేఖ్‌ మాట్లాడుతూ – ‘‘ఒక దశలో, హెచ్‌డీఎఫ్‌సీని ఐసీఐసీఐలో విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అది చందాకొచ్చర్‌ ఐసీఐసీఐ సీఈఓగా ఉన్న సమయంలోనే జరిగింది. కానీ నేను స్పష్టంగా తిరస్కరించాను’’ అన్నారు. పరేఖ్‌ వివరించిన విధంగా – ‘‘అప్పుడు మా బ్రాండ్‌, సంస్థ లక్ష్యాలు వేరేలా ఉన్నాయి. విలీనం మాకు అనుకూలంగా ఉండదని నమ్మాను. అందుకే ఆ ఆలోచనను ముందే తిరస్కరించాను.’’ అన్నారు.

చందాకొచ్చర్ కీలక పాత్ర

చందాకొచ్చర్‌ 2009 నుంచి 2018 వరకు ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓగా వ్యవహరించగా, 2023లో హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం అయింది. ఈ విలీన ప్రక్రియపై మాట్లాడుతూ, దీపక్‌ పరేఖ్‌ "ఇది ఒక బాధాకరమైన, ఆనందకరమైన రోజుగా గుర్తుండిపోతుంది" అని పేర్కొన్నారు. అలాగే, ఈ విలీనానికి ఆర్బీఐ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. అయితే, ఇది ప్రత్యేక రాయితీల రూపంలో కాకుండా, సాధారణ మద్దతుగా మాత్రమే నిలిచిందని స్పష్టం చేశారు. పరేఖ్‌ అభిప్రాయం ప్రకారం, భారతదేశానికి ప్రపంచస్థాయి పెద్ద బ్యాంకులు అవసరం. చైనా వంటి దేశాల్లో ఉన్న భారీ బ్యాంకుల మాదిరిగా, భారతదేశంలోనూ బ్యాంకింగ్‌ రంగంలో కన్సాలిడేషన్‌ జరుగుతుండటం సానుకూలమని అన్నారు. కొనుగోలు, విలీనాల ద్వారా మాత్రమే దీన్ని సాధించగలమని అభిప్రాయపడ్డారు. అంతేకాక, దేశంలోని బీమా రంగం గురించి అవగాహన లోపించిందని, బ్యాంకులు కమీషన్‌ కోసమే బీమా ఉత్పత్తులను "మిస్‌సెల్" చేయడం విచారకరమని చెప్పారు. ఈ విషయంపై సరైన దృష్టి అవసరమని హెచ్చరించారు.

Tags

Next Story