Digital Gold:బంగారంపై పెట్టుబడి వృధా కాదు.. ఇప్పుడు డిజిటల్ రూపంలోనూ గోల్డ్..

Digital Gold:బంగారంపై పెట్టుబడి వృధా కాదు.. ఇప్పుడు డిజిటల్ రూపంలోనూ గోల్డ్..

Digital Gold

Digital Gold:అమ్మాయికి కట్న కానుకల రూపంలో బంగారం కూడా పెట్టడం తర తరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు కచ్చితంగా ఆదుకుంటుంది బంగారం.

Digital Gold:అమ్మాయికి కట్న కానుకల రూపంలో బంగారం కూడా పెట్టడం తర తరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు కచ్చితంగా ఆదుకుంటుంది బంగారం. వస్తు రూపంలో ఉన్న బంగారం కాస్తా ఇప్పుడు డిజిటల్ రూపంలో కూడా వస్తోంది. బంగారంలో డిజిటల్ పెట్టుబడులు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. డిజిటల్ గోల్డ్‌తో పాటు గోల్డ్ ఈటీఎఫ్‌లు, బంగారంపై ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

సహజంగా బంగారాన్ని ఆభరణాలు, కాయిన్ల రూపంలో భద్రపరుచుకోవడానికే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తుంటారు. వీటికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు డిజిటల్ గోల్డ్ కూడా ఆదరణ పొందుతోంది. బంగారంలో పెట్టుబడులకు ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుత రోజుల్లో డిజిటల్ గోల్డ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది.

వస్తు రూపంలో బంగారం కొనుగోలు చేస్తే.. అమ్మేటప్పుడు ఎంత విలువ కడతారన్నది కచ్చితంగా చెప్పలేము. అదే డిజిటల్ గోల్డ్ అయితే ఇటువంటి సమస్యలేవీ ఉండవు. ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయడం కూడా చాలా సులభం.

మన దేశంలో డిజిటల్ గోల్డ్‌ను ప్రధానంగా మూడు సంస్థలు అందిస్తున్నాయి. అవి ఆగ్మంట్ గోల్డ్, ఎమ్ఎమ్‌టీసీ-పీఏఎమ్‌పీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డిజిటల్ గోల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సేఫ్ గోల్డ్ బ్రాండ్‌పై). వీటి తరపున గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎమ్, గ్రోవ్, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్య మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్, అమెజాన్ ఇండియా తదితర సంస్తలు తమ వేదికలపై డిజిటల్ గోల్డ్ కొనుగోలు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత.. అంత మొత్తానికి సరిపడా బంగారాన్ని ఈ సంస్థలు కొనుగోలు చేసి ఇన్వెస్టర్ పేరు మీద ఖజానాల్లో భద్రపరుస్తారు. డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే గ్రాములు లేదా రూపాయి వ్యాల్యూలో కొనుగోలు చేసుకోవచ్చు. పేమెంట్ విధానాన్ని ఎంచుకుని చెల్లింపులు చేస్తే సరిపోతుంది. బ్యాంకు ఖాతా, కార్డులు లేదా వ్యాలెట్ నుంచి అయినా చెల్లింపులు చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ అవసరాన్ని బట్టి డిజిటల్ రూపంలో ఉన్న బంగారాన్ని విక్రయించుకోవచ్చు.

ఒకవేళ విక్రయించుకునే ఉద్దేశం లేకపోతే మీ బంగారాన్ని మీరే స్వయంగా తీసుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కాయిన్లు లేదా బులియన్ రూపంలో మీ ఇంటివద్దకే డెలివరీ అయ్యే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

పేటీఎం ప్లాట్‌ఫామ్‌పై రూపాయి నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల విలువకు సరిపడా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసుకోవచ్చు. బంగారాన్ని విక్రయించే సమయంలో బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో విక్రయించిన 72 గంటల్లో ఆ మొత్తం ఇన్వెస్టర్ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. పేటీఎం ఫ్లాట్‌ఫామ్‌పై కొనుగోలు చేసిన బంగారాన్ని మీకు నచ్చిన వారికి కానుకగా ఇచ్చుకునే సదుపాయం కూడా ఉంది. పేటీఎం ఇటీవలే కళ్యాణ్ జ్యుయలర్స్, పీసీ జ్యుయలర్స్ తదితర సంస్థలతోనూ టై‌అప్ అయింది. దీంతో పేటీఎమ్ యూజర్లు తమ డిజిటల్ గోల్డ్‌ను కళ్యాణ్ జ్యుయలర్స్, పీసీ జ్యుయలర్స్ సంస్థల్లో ఆభరణాలుగా మార్చుకోవచ్చు.

డిజిటల్ గోల్డ్ కొనుగోలుపైన 3% జీఎస్‌టీని చెల్లించాలి. ఉదాహరణకు రూ.1000తో డిజిటల్ గోల్డ్‌కు ఆర్డర్ చేస్తే రూ.970 విలువకే బంగారం పొందగలరు. దీనికి తోడు ఇతర చార్జీలు కూడా ఉంటాయి. చివరిగా డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు బీమా సదుపాయం ఉందో లేదో నిర్ధారించుకున్న తరువాతే నిర్ణయం తీసుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story