Gold: డిస్కౌంట్లు ఊరించినా.. బంగారం కొనే విషయంలో జాగ్రత్త..

Gold: డిస్కౌంట్లు ఊరించినా.. బంగారం కొనే విషయంలో జాగ్రత్త..
Gold:మజూరీ లేదు.. తరుగు లేదు.. అని కొనుగోలు దారులను ఊరిస్తుంటాయి. అయితే పసిడి కొనేటప్పుడు ఆచి తూచి అడుగేయాలి.

Gold: పండగ రోజు పట్టు పరికిణీతో పాటు ఓ చిన్న బంగారం గొలుసు అయినా వేసుకోవాలని ముచ్చట పడుతుంది తెలుగింటి అమ్మాయి. మగువల మనసు దోచుకునే బంగారు ఆభరణాలు పండగ సీజన్‌లో డిస్కౌంట్లు ఎర చూపుతుంటాయి.. మజూరీ లేదు.. తరుగు లేదు.. అని కొనుగోలు దారులను ఊరిస్తుంటాయి. అయితే పసిడి కొనేటప్పుడు ఆచి తూచి అడుగేయాలి. ఒకటికి రెండు మూడు షాపులు తిరిగి రేటు తెలుసుకోవాలి. నాణ్యత పరిశీలించాలి.

24 క్యారెట్లల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం అని అంటారు. ఇది కాయిన్లు, బార్లు, బిస్కెట్ల రూపంలో దొరుకుతుంది. ఈ బంగారాన్ని ఆభరణాలు తయారు చేయాలంటే వెండి, రాగి వంటి లోహాల్ని కలుపుతారు. పూరీటీని గుర్తించేందుకు 916 హాల్ మార్క్ ముద్ర తప్పనిసరి చేసింది ప్రభుత్వం. చిన్న వస్తువు కొన్నా దాని మీద బీఐఎస్ ముద్ర, నాణ్యత, హాల్ మార్కింగ్ గుర్తు, ఏ సంవత్సరంలో ఆ ముద్ర వేశారు వంటివి అన్నీ ఉంటాయి. ఇక నగ ఏ షాపులో కొన్నారో కూడా ముద్రించి ఉంటుంది. కొనేటప్పుడు ఈ ఐదు అంశాలు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. హాల్ మార్క్ అనేది బయట స్వర్ణకారులతో చేయించుకున్నా తప్పనిసరిగా వేయించుకోవాలి. లేదంటే మీరు అవసరానికి ఆ వస్తువును అమ్మినప్పుడు సరైన ధర నిర్ణయించబడదు.

24 క్యారెట్ల బంగారానికి ఎంత మోతాదులో రాగి, వెండి వంటి లోహాల్ని కలుపుతున్నారు అనేదానిపై స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. విదేశాల్లో అయితే 9, 10 క్యారెట్ల నుంచి ఆభరణాలు దొరుకుతాయి. కానీ మన దగ్గర 14 నుంచి 24 క్యారెట్ల వరకు ఆభరణాలు ఉంటాయి. హాల్ మార్క్ లేకుండా విక్రయించే ఆభరణాలు 18 క్యారెట్లు ఉంటాయని అంచనా..

కొన్ని నగల దుకాణాలు జీరో మేకింగ్ ఛార్జీలు అంటూ రాయితీలు ఇస్తాయి. అయితే వీటిని మరో రూపంలో వసూలు చేస్తారు దుకాణదారులు. అది గమనించుకోవాలి. ఇక పాత బంగారాన్ని మార్చినప్పుడు కూడా నగ రూపంలో కాకుండా దాన్ని కరిగించి స్వచ్ఛతను అంచనా వేయించుకోండి.. దానికి లెక్క కట్టమనండి. ఎంతైనా పాత బంగారం స్వచ్ఛతలో కానీ నాణ్యతలో కానీ కొత్త బంగారం కంటే మెరుగ్గా ఉంటుంది.

బీఐఎస్ నిబంధనల ప్రకారం రాళ్ల బరువు, బంగారం బరువు విడివిడిగా వేయాలి. ఆ వివరాలన్నీ రసీదులో స్పష్టంగా రాయించుకోవాలి. ఒకవేళ ఇంకా విలువైన రాళ్లు పచ్చలు, రూబీ వంటివైతే మారిస్తే ఎంత వస్తుందో తెలుసుకోవాలి. ఈ రసీదు కంప్యూటర్ బిల్లు అయితే మంచిది. భవిష్యత్తులో బంగారం మార్చేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. మీకు స్వచ్ఛమైన బంగారం అని చెప్పి దుకాణదారు మోసం చేస్త కోర్టును ఆశ్రయించి డబ్బులు తిరిగి పొందొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story