drone: దేశీయ డ్రోన్ తయారీకి కేంద్రం రూ.2000 కోట్లు

దేశ రక్షణ, పౌర అవసరాలను తీర్చే డ్రోన్ రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం దాదాపు 234 మిలియన్ డాలర్లు (రూ.2000 కోట్లు) విలువైన కొత్త ప్రోత్సాహక పథకాన్ని ఆవిష్కరించనున్నట్టు వార్తా సంస్థ రాయిటర్స్ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.
ఈ పథకం మూడేళ్ల పాటు అమలులో ఉంటుంది. డ్రోన్లు, విడిభాగాలు, సాఫ్ట్వేర్, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, సేవలు తదితర అంశాలు ఇందులో చేరే అవకాశం ఉంది. 2021లో ప్రారంభమైన పీఎల్ఐ పథకం కింద అందించిన రూ.120 కోట్లతో పోలిస్తే, ఇది అనేక రెట్లు అధికమైంది. పహల్గాంలో జరిగిన మారణహోమం, ఆ తర్వాత భారత–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రోన్ల ప్రాధాన్యం ఎంత వరకు ఉందో స్పష్టమైంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ నుంచి డ్రోన్లను దిగుమతి చేసుకుంటూ వచ్చిన భారత్, ప్రస్తుతం కొన్ని డ్రోన్లను సొంతంగా తయారు చేస్తోంది. అయితే, మోటార్లు, సెన్సర్లు, ఇమేజింగ్ సిస్టమ్స్ కోసం ఇప్పటికీ చైనాపై ఆధారపడుతోంది. తాజాగా రూపొందించిన పథకం కింద 2027–28 నాటికి కనీసం 40% కీలక విడిభాగాలను దేశీయంగా ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 600కు పైగా డ్రోన్ తయారీ సంస్థలు ఉన్నాయి. వీటిలో దేశీయంగా విడిభాగాలను ఉత్పత్తి చేసే సంస్థలకు అదనపు ప్రోత్సాహకాలు, తక్కువ వడ్డీ రుణాలు అందించే అంశంపై కేంద్రం యోచిస్తోంది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ (SIDBI) సంస్థలు మూలధన అవసరాల కోసం ప్రత్యేక రుణ పథకాలు అందించనుంది. ఈ ప్రతిపాదిత పథకం అమలయ్యే సందర్భంలో భారత్ డ్రోన్ రంగంలో స్వయంగా ఎదిగే దిశగా ముందడుగు పడుతుంది. ఆపరేషన్ సిందూర్ తరువాత దేశీయ డ్రోన్ కంపెనీల స్టాక్స్ ఒక్కసారిగా పెరిగాయి. ఈ క్రమంలో డ్రోన్లకు భవిష్యత్తులో మంచి ఆదరణ ఉంటుందని, యుద్ధాల కోసమే పెద్ద ఎత్తున డ్రోన్లకు ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నాయి ఆయా కంపెనీలు. ఈ క్రమంలో దేశీయం ఉత్పత్తులకు ఆర్డర్లు పెరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి.
డిమాండ్లకు అనుగుణంగా....
భారతదేశ డ్రోన్ పరిశ్రమ స్వదేశీ ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి, దిగుమతులను తగ్గించడానికి, డ్రోన్ టెక్నాలజీలో దేశ నాయకత్వ స్థానాన్ని పెంచడానికి ఎక్కువ ఆర్థిక సహాయం, విధాన మద్దతు చర్యలను పారిశ్రామిక రంగం డిమాండ్ చేస్తోంది. ఈ రంగం వృద్ధి రేటును పెంచడానికి ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహక (PLI) పథకాన్ని విస్తరించాలని, పన్ను ప్రయోజనాలు కల్పించాలని మరియు మూలధనాన్ని అందుబాటులో ఉంచడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాలని పరిశ్రమ నాయకులు పిలుపునిచ్చారు. డ్రోన్ల కోసం మొదటి PLI పథకం సెప్టెంబర్ 2021న మూడు సంవత్సరాలలో రూ. 120 కోట్లతో ప్రారంభించబడింది. ఇది డ్రోన్ ఉత్పత్తి, భాగాల తయారీ మరియు సాఫ్ట్వేర్ అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ పరిశ్రమను పూర్తిగా ఇంధనంగా మార్చడానికి చాలా ఎక్కువ కేటాయింపులు అవసరమని నివేదిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com