దసరా ఆఫర్లు : ఆ ఫోన్ వస్తే కచ్చితంగా మోసమే..

దసరా పండుగ పూట.. ఈ కామర్స్ సంస్థలు ఊహించని డిస్కౌంట్లు, ఆశ్చర్యపోయే ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. వేలకు వేలు డిస్కౌంట్లు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి.. అబ్బురపరిచే ఆఫర్లతో వల వేస్తున్నారు. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినందుకు లాటరీ తగిలిందని, కారు బహుమతిగా వచ్చిందని.. బహుమతులకు బదులుగా నగదు కూడా ఇస్తామంటూ నిండా ముంచుతున్నారు. ఆన్‌లైట్ షాపింగ్ చేసేవాళ్ల కేవైసీ అప్‌డేట్ పేరుతో బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుంటున్నారు. వివరాలు ఇవ్వగానే.. ఖాతా ఖాళీ చేసేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు వాట్సప్, ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్‌బుక్ సహా సోషల్ మీడియా వేదికల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. మొదటి వెయ్యిమంది కొనుగోలుదారులకు ఆఫర్లు వర్తిస్తాయంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఓ లింక్‌ను అటాచ్ చేసి, ప్రముఖ బ్రాండ్ల పేర్లు వాడుకుంటారు. ఆ లింక్ క్లిక్ చేయగానే స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌లోకి వైరస్ చేరుతుంది. రహస్య ఆర్థిక లావాదేలీల వివరాలు సైబర్ నేరగాళ్లకు వెళ్లిపోతాయి. ఫేక్ వెబ్‌సైట్లు, మోసపూరిత ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్‌లో అజాగ్రత్త తగదని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ఈ కామర్స్ యాప్‌లపై పెద్దగా అవగాహన లేకపోతే... దూరంగా ఉండటమే ఉత్తమమని చెబుతున్నారు. లాటరీలో బహుమతి గెల్చుకున్నారని ఫోన్ వస్తే... అది కచ్చితంగా మోసపూరిత ఫోన్ కాలే అని స్పష్టంచేస్తున్నారు. ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. వేడుక సమయంలో ఆర్థికంగా నష్టపోయి... బాధపడకూడదని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com